- నమన్ హాఫ్‌సెంచరీ వృథా
చెన్నై: ఐపీఎల్19లో భాగంగా మూడు వరుస ఓటముల తర్వాత ముంబైపై.. చెన్నైకి విజయం దక్కింది. శనివారం ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. మొదటగా టాస్ నెగ్గిన ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. నమన్ధీర్( 37 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57), రికెల్టన్( 24బాల్స్‌లో 5 సిక్స్‌లతో 37) రాణించారు.
చెన్నై బౌలర్లలో అన్షుల్కాంబోజ్3, నూర్ అహ్మద్2 వికెట్లు తీశారు. అనంతరం చెన్నై (18.1) ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రుత్రాజ్ ( 48 బాల్స్‌లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 ), కార్తీక్‌శర్మ ( 40 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 54) హాఫ్‌సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్అవార్డ్ రుత్‌రాజ్‌కు దక్కింది.
చెన్నై బౌలర్లు కట్టుదిట్టం..
ముంబై జట్టులో నమన్ ధీర్, రికెల్టన్ మినహాయించి పెద్దగా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. సీఎస్‌కె బౌలర్ ముఖేశ్ చౌదరి తొలి ఓవర్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఐపీఎల్ అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోశ్ రెండో ఓవర్లో విల్ జాక్స్‌ను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఫామ్‌లో ఉన్న రికెల్టన్.. ముఖేశ్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది ముంబై ఇన్సింగ్స్‌ను స్పీడప్ చేశాడు. మరోవైపు నమన్ ధీర్ కాంబోజ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టి జోరు పెంచాడు. ప్రశాంత్ వీర్ వేసిన ఓవర్లో రికెల్టన్ మూడు సిక్సర్లు బాది ముంబైకి 18 పరుగులు అందించాడు.
పవర్‌ప్లే ముగిసే సమయానికి ముంబై ఒక వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. 19 పరుగుల వద్ద నమన్ ధీర్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను శివమ్ దూబే వదిలేశాడు. ప్రమాదకరంగా మారుతున్న రికెల్టన్‌ను నూర్ అహ్మద్ అవుట్ చేసి చెన్నైకి బ్రేక్ ఇచ్చాడు. తన తొలి ఐపీఎల్ ఓవర్ వేసిన రామకృష్ణ ఘోశ్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్ (21) వేగంగా ఆడే ప్రయత్నం చేసినప్పటికీ ఘోశ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఇది ఘోశ్కు తొలి ఐపీఎల్ వికెట్. స్వీప్ షాట్‌కు ప్రయత్నించిన తిలక్ వర్మ అవుట్ కావడంతో ముంబై మరో కీలక వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా సహా ఇతర బ్యాటర్లు భారీ షాట్లు ఆడడంలో విఫలం కావడంతో ముంబై 159 పరుగులకే పరిమితమైంది.
గైక్వడ్ కెప్టెన్ ఇన్నింగ్స్..
ముంబై నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని చెన్నై మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. 48 బంతుల్లో 67 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రుతురాజ్.. కార్తీక్ శర్మ (54 నాటౌట్)తో కలిసి మూడో వికెట్‌కు అజేయంగా 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
దీంతో చెన్నై 18.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఉర్విల్ పటేల్ (24; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. సంజు శాంసన్ (11) తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. తొమ్మిది మ్యాచ్‌ల్లో చెన్నైకిది నాలుగో విజయం.
సంక్షిప్త స్కోర్లు:
- ముంబై ఇండియన్స్: 20 ఓవర్లలో 159/7 (నమన్ ధీర్ 57, రికెల్టన్ 37; అన్షుల్ కాంబోజ్ 3/32, నూర్ అహ్మద్ 2/26)
- చెన్నై సూపర్ కింగ్స్: 18.1 ఓవర్లలో 160/2 (రుతురాజ్ గైక్వాడ్ 67 నాటౌట్, కార్తీక్ శర్మ 54 నాటౌట్; జస్ప్రీత్ బుమ్రా 1/20)
