ఆస్తమా వ్యాధిగ్రస్తులకు అందించే చేప ప్రసాదం పంపిణీ జూన్ 8న ప్రారంభించనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఉబ్బసం, శ్వాస కోస వ్యాధులను వివారించేందుకు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం పంపిణీ ఉంటుందని బత్తిని మృగశిర ట్రస్టు నిర్వాహకులు, దివంగత బత్తిని హరినాథ్కొడుకు అమర్నాథ్ గౌడ్ తెలిపారు.
జూన్ 8వ తేదీన తమ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం సేవించిన తర్వాత సాయంత్రం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తరలించనున్నట్లు తెలిపారు. ముహూర్తం ప్రకారం అదేరోజు రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
చేప ప్రసాదం పంపిణీకి ఇప్పటికే ఫిషరీ డిపార్ట్మెంట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్, పోలీస్ డిపార్ట్మెంట్, జీహెఎంసీ, ప్రభుత్వం పర్మిషన్ తీసుకున్నామని బత్తిని కుటుంబ సభ్యులు అమర్‌నాథ్ గౌడ్, గౌరీ శంకర్ గౌడ్, అనిరుధ్ గౌడ్, దుర్గా గౌడ్ మంగళవారం తెలిపారు.
సుమారు 180 ఏండ్లకు పైగా చేప ప్రసాదం పంపిణీ జరుగుతోందని, ఎక్కడా ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్చైర్స్తోపాటు అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు శతాబ్దాలుగా బత్తిని కుటుంబం చేపప్రసాదం పంపిణీ చేస్తోందని తెలిపారు. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాశ సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తె ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్థాన్ని చేప ద్వారా నోటిలో వేస్తామని ఆయన పేర్కొన్నారు.
