Cheteshwar Pujara: టెస్ట్ క్రికెట్‌లో మీరొక అద్భుతం.. పుజారాకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంస లేఖ

Cheteshwar Pujara: టెస్ట్ క్రికెట్‌లో మీరొక అద్భుతం.. పుజారాకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంస లేఖ

టీమిండియా నయా వాల్, టెస్ట్ స్పెషలిస్ట్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు ఆదివారం (ఆగస్టు 24) రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 13 సంవత్సరాల పాటు భారత టెస్ట్ జట్టులో  మూడో స్థానంలో కీలక ఇన్నింగ్స్ లు ఆడి ద్రవిడ్ వారసుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో పుజారా కీలక పాత్ర పోషించాడు. 100కి పైగా టెస్టులాడిన పుజారాను భారత ప్రధాని ఆదివారం (ఆగస్టు 31) ప్రశంసించారు. ఈ నయా వాల్ కు ప్రశంసా లేఖ రాస్తూ పొగడ్తల వర్షం కురిపించారు. 

పుజారా రిటైర్మెంట్ తర్వాత ప్రధాన నరేంద్ర మోడీ తన హృదయపూర్వక మాటలను షేర్ చేసుకున్నారు.. "ప్రస్తుత క్రికెట్ లో చిన్న ఫార్మాట్లు ఆధిపత్యం చెలాయించే యుగంలో మీరు సుదీర్ఘ ఫార్మాట్ బ్యూటీ ఏంటో గుర్తుచేసేవారు. మీ అద్భుతమైన వ్యక్తిత్వం, గొప్ప ఏకాగ్రతతో ఎక్కువ గంటలు క్రీజ్ లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం మిమ్మల్ని గొప్ప క్రికెటర్ గా నిలబెట్టాయి. ముఖ్యంగా విదేశాల్లో సవాలుతో కూడిన పరిస్థితుల్లో మీరు గొప్ప క్రికెట్ ఆడారు". అని మోడీ పుజారాకు రాసిన లేఖలో ప్రస్తావించారు.  

ఉదాహరణకు.. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల వంటి గొప్ప క్షణాలు అభిమానులు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. ఆ సమయంలో మీరు ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా చారిత్రాత్మక తొలి సిరీస్ విజయానికి పునాది వేశారు. "అత్యంత శక్తివంతమైన బౌలింగ్ ఎటాక్ ను ఎదురొడ్డి నిలబడ్డారు. ప్రత్యర్థికి వ్యతిరేకంగా నిలబడి, జట్టుకు బాధ్యత వహించడం అంటే ఏమిటో మీరు చూపించారు". అని 2018, 2021లో ఆస్ట్రేలియాలో వరుస సిరీస్ విజయాలలో పుజారా కీలక పాత్రను ప్రస్తావిస్తూ మోడీ తెలిపారు. 

దేశీయ క్రికెట్ పట్ల పుజారాకు ఉన్న నిబద్ధతను మోడీ ప్రశంసించారు. "అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్నప్పటికీ.. సౌరాష్ట్ర తరపున కూడా ఆడుతూ రాష్ట్రంపై మీ మక్కువను తెలియజేశారు. సౌరాష్ట్ర క్రికెట్‌తో మీకున్న దీర్ఘకాల అనుబంధం, రాజ్‌కోట్‌ను క్రికెట్ పటంలో ఉంచడంలో మీ సహకారం ఆ ప్రాంతంలోని ప్రతి యువకుడికి గర్వకారణంగా నిలుస్తుంది". అని ప్రధాని అన్నారు.

ప్రధాని మాటలకు స్పందించిన పుజారా ఇలా అన్నాడు.. " నా పదవీ విరమణ సందర్భంగా మన గౌరవనీయ ప్రధానమంత్రి నుండి ప్రశంసా పత్రం అందుకోవడం నాకు గౌరవంగా ఉంది. ప్రధాని హృదయపూర్వక భావాలు చాలా ప్రశంసనీయం. నేను నా రెండో  ఇన్నింగ్స్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు నాకు లభించిన ఇలాంటి ప్రేమ, ప్రశంసలను  ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు సర్." అని పుజారా అన్నాడు.