- తీవ్ర రక్తహీనతకు చికిత్స అందించిన ఏరియా ఆస్పత్రి వైద్యులు
- అభినందించిన కలెక్టర్
భద్రాచలం, వెలుగు: తీవ్ర రక్తహీనతతో బాధ పడుతున్న చత్తీస్గఢ్రాష్ట్రానికి చెందిన ఓ బాలుడికి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా హాస్పిటల్డాక్టర్లు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్‌గఢ్‌లోని కిష్టారం గ్రామానికి చెందిన గిరిజన బాలుడు మల్లం నరేశ్తీవ్రమైన ఆయాసం, పొట్ట ఉబ్బడం, ఒళ్లంతా మచ్చలు, జ్వరంతో బాధ పడుతుండగా తండ్రి ఈ నెల 5న భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేర్పించాడు. వైద్య పరీక్షలు చేశాక నరేశ్‌కు తీవ్ర రక్తహీనత ఉందని పిల్లల వైద్యుడు రాజశేఖర్‌రెడ్డి తేల్చారు. 10 నుంచి 14 గ్రాములు ఉండాల్సిన రక్తం ఒక గ్రాము కంటే తక్కువ ఉండటంతో వైద్యులు విస్తుపోయారు.
వెంటనే చికిత్స ప్రారంభించడంతో రక్తం దాదాపు 8 గ్రాములకు పెరిగింది. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో గురువారం డిశ్చార్జ్‌చేశారు. డీసీహెచ్ రవిబాబు ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్ జితేశ్వి.పాటిల్ బాలుడితోపాటు అతని తండ్రి, అక్క, డాక్టర్రాజశేఖర్రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్డాక్టర్రామకృష్ణను కలెక్టరేట్‌కు పిలిపించారు. తల్లి లేకపోవడంతో ఆరేండ్ల సోదరే నరేశ్‌ను దగ్గరుండి చూసుకుందని తెలిసి చలించిపోయారు. వారికి పండ్లు అందజేశారు. హైదరాబాద్‌లోని నీలోఫర్వంటి పెద్ద హాస్పిటళ్లు, కార్పొరేట్ఆస్పత్రుల్లో చేసే వైద్యాన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో అందించిన డాక్టర్లను అభినందించారు.
