చికెన్ రేటు రూ.400 చేరువలో... రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధర.. కేజీ కొనేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్న వైనం

చికెన్ రేటు రూ.400 చేరువలో... రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధర.. కేజీ కొనేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్న వైనం
  • స్కిన్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ చికెన్‌‌‌‌‌‌‌‌ కేజీ రూ.360 నుంచి 380 
  • త్వరలోనే రూ. 400 వరకు పెరగొచ్చంటున్న నిర్వాహకులు
  • కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్లే రేట్లు పెరిగాయంటున్న చికెన్ షాప్ ఓనర్లు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో చికెన్ రేట్లు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం కిలో స్కిన్‌‌‌‌‌‌‌‌ లెస్‌‌‌‌‌‌‌‌ చికెన్ రూ.360 నుంచి రూ.380 పలుకుతుండగా.. ఈ ధర త్వరలో రూ.400 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో మార్చి చివరి వారంలో కేజీ చికెన్‌‌‌‌‌‌‌‌ రూ.360కి చేరుకొని.. ఆ తర్వాత కాస్త తగ్గుముఖం పట్టి రూ.300కు దిగి వచ్చింది. 

తాజాగా  మళ్లీ కేజీ ధర రూ.380 వరకు పలుకుతుండడంతో చికెన్‌‌‌‌‌‌‌‌ ప్రియులు కొనేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోంది. లేదంటే కేజీ కొనేవారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. ఎండల తీవ్రత కారణంగా కోళ్ల ఉత్పత్తి తగ్గడం వల్లే రేట్లు పెరుగుతున్నాయని చికెన్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులు చెప్తున్నారు.

ఎండల తీవ్రతతో పడిపోయిన ఉత్పత్తి

వానాకాలం, చలికాలంలో కోళ్ల ఉత్పత్తి బాగానే ఉన్నప్పటికీ.. వేసవికాలంలో మాత్రం ఎండత తీవ్రత కారణంగా ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఎండ వేడికి తట్టుకోలేక బ్రాయిలర్‌‌‌‌‌‌‌‌ కోళ్లు చనిపోతుండడంతో చికెన్‌‌‌‌‌‌‌‌ షాపులకు సప్లై సగానికి పడిపోయింది. ఎండల కారణంగా కోళ్లలో ఎదుగుదల సైతం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఎండలు, వడగాలుల నుంచి కోళ్ల సంరక్షణకు కూలర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయడం పౌల్ట్రీ రైతులకు అదనపు భారంగా మారింది. 

ఎండలకు కోళ్లు చనిపోతాయన్న కారణంతో చాలా మంది రైతులు కోళ్ల ఉత్పత్తిని ఆపేశారు. ఫలితంగా రాష్ట్రంలో కొన్నాళ్లుగా కోళ్లు షార్టేజీ అయ్యాయి. అందుకే గత రెండు నెలులుగా ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర  తదితర రాష్ట్రాల నుంచి కోళ్లను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంతోనే చికెన్‌‌‌‌‌‌‌‌ ధర రికార్డు స్థాయికి చేరిందని, మరికొన్ని రోజుల్లో కేజీ చికెన్ రూ.400 దాటే అవకాశముందని వ్యాపారులు చెప్తున్నారు. వివిధ ప్రాంతాల్లో లైవ్ కోడి ధర రూ.190 నుంచి రూ.220 పలుకుతోంది. 

పెద్ద కంపెనీలకే లాభాలు

రాష్ట్రంలోని పౌల్ట్రీ రంగంలో వెన్‌‌‌‌‌‌‌‌కాబ్‌‌‌‌‌‌‌‌, స్నేహ వంటి 28 వరకు పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలే చికెన్‌‌‌‌‌‌‌‌ రేటును నిర్ణయిస్తాయి. రైతులకు సంబంధించిన పౌల్ట్రీ ఫామ్స్‌‌‌‌‌‌‌‌ కూడా కొన్నేళ్లుగా చిక్స్, దాణా సప్లై పేరిట ఈ కంపెనీల చేతుల్లోకే వెళ్లాయి. ఈ పెద్ద కంపెనీలన్నీ సిండికేట్‌‌‌‌‌‌‌‌గా మారి రైతులకు చిక్స్, దాణా సప్లై చేస్తూ ఆయా కంపెనీలే ధర నిర్ణయిస్తున్నాయి. కోడి పిల్ల రేటు గతంలో రూ.35 వరకు ఉండగా ఇప్పుడు రూ.70 చేయడంతో వెయ్యి, రెండు వేల కోళ్లు పెంచే చిన్న రైతులు తమ వల్ల కాదని పెంపకాన్ని ఆపేశారు. 

అలాగే చికెన్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల ఓనర్లకు మార్జిన్‌‌‌‌‌‌‌‌ను కూడా కంపెనీలే నిర్ణయిస్తున్నాయి. గతంలో కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు ఇచ్చే మార్జిన్‌‌‌‌‌‌‌‌ను.. ఇటీవల రూ.10 నుంచి రూ.15కే పరిమితం చేయడంతో  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 1 నుంచి చికెన్ సెంటర్ల బంద్‌‌‌‌‌‌‌‌కు నిర్వాహకులు సిద్ధమైన విషయం తెలిసిందే. దీంతో కంపెనీలు దిగొచ్చి మార్జిన్‌‌‌‌‌‌‌‌ను పాత పద్ధతిలోనే ఇస్తామని ప్రకటించాయి. అయితే కంపెనీల నిర్వాహకులు తమ లాభాలను వదులుకోకుండా మార్జిన్‌‌‌‌‌‌‌‌ భారాన్ని జనంపై మోపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి . 

ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ లేకనే ధరలు పెరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌

కోళ్ల ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ తగ్గడం వల్లే రేట్లు పెరుగుతున్నయ్‌‌‌‌‌‌‌‌. ఎండాకాలంలో కోళ్లు చనిపోతే లాస్ అవుతామన్న భయంతో చిన్న రైతులెవరూ కోళ్లను పెంచడం లేదు. చిన్న రైతులు ఉంటే సమీప పట్టణాలు, గ్రామాలకు కోళ్లు అందించే వాళ్లు. చిక్స్‌‌‌‌‌‌‌‌, దాణా రేట్లు పెరగడం కూడా రైతులకు భారంగా మారింది. దీంతో చికెన్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల నిర్వాహకులం పెద్ద కంపెనీల నుంచి వాళ్లు ఇచ్చిన ధరకు కోళ్లు తెచ్చుకోవాల్సి వస్తోంది.   
- మల్లేశ్‌‌‌‌‌‌‌‌, చికెన్‌‌‌‌‌‌‌‌సెంటర్ నిర్వాహకుడు, కరీంనగర్