Childrens day special 2025: పిల్లలకు ఙ్ఞానం .. చక్కటి చందమామ పుస్తకం..

Childrens day special 2025:   పిల్లలకు ఙ్ఞానం .. చక్కటి చందమామ పుస్తకం..

నేటిపిల్లలుసెల్ ఫోన్లో వీడియో గేమ్స్ అడుతూ, కార్టూన్ చానల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. టీవీలు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కంప్యూటర్ లు లేని కాలంలో చిన్నారులకు సంతోషాన్ని, విజ్ఞానాన్ని పంచింది పత్రికలే. చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలభారతి... లాంటి ఎన్నో పత్రికలు చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ అలరించాయి.

 పిల్లల మనసును ఆకట్టుకుంటూ వాళ్లలో ఆలోచనా శక్తిని పెంచేవి. వాటిలో 'చందమామ' పత్రికది చెరగని స్థానం సంపాదించుకుంది.  నవంబర్​ 14 చిల్డ్రన్స్​ డే సందర్భంగా పూర్వకాలంలో పిల్లలు  ఎలాంటి పుస్తకాలు చదివి ఙ్ఞానాన్ని సంపాదించారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .  .! 

దాదాపు 5 దశాబ్ధాల కాలం తెలుగువారి జీవితాల్లో చందమామ చెరగని ముద్ర వేసింది.
1960–- 90ల మధ్యకాలంలో చందమామ' తెలుగింటి లోగిళ్లలో వెన్నెల వెదజల్లింది. నేటి పెద్దలందరూ చందమామ పుస్తకాన్ని  జ్ఞాపకంగా గుండెల్లో పదిల పరుచుకున్న వాళ్లే .  అలాంటి 'చందమామ'ను బైండింగ్ చేయించుకునిభద్రంగా దాచుకున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఇంతగా తెలుగువాళ్ల జీవితాలతో ముడిపడిన 'చందమాము చరిత్రలోకి తొంగిచూసి  ఆ పుస్తకం విశేషాలను తెలుసుకుందాం..

సంబరం

చందమామ పత్రికను బి. నాగిరెడ్డి, చక్రపాణి కలిసి ప్రారంభించారు. ఒకరు దాదా సాహిబ్ ఫాల్కే 
పురస్కార గ్రహీత.  మరొకరు పాతాళ భైరవి... మాయాబజార్... గుండమ్మకథ లాంటి ఎన్నో అద్భు తమైన చిత్రాలు అందించిన విజయాసంస్థ స్థాపకులు.   నిజానికి చందమామ చక్రపాణి మానస పుత్రిక.   

1947 జూలైలో మొదలైన -ఈ పత్రిక తెలుగు, తమిళ భాషల్లో మొదటి సారిగా వెలువడింది. ఆ తర్వాత 13 భాషల్లో ఈ పత్రికను తీసుకొచ్చారు. అమెరికా, కెనడా లాంటి దేశాల్లో తెలుగు, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ వచ్చేది. 

చెరగని ముద్ర

నాగిరెడ్డి, చక్రపాణి తెలుగువారి ఆచారాలు, అలవాట్లను పిల్లలకు తెలియజేయాలనే ఉద్దేశంతో చందమామను ప్రారంభించారు. చిన్న చిన్న వాక్యాలు, అందమైన పదబంధాలు, తేలికపాటి పదాలతో తెలుగు భాషను చిన్నా రులకు నేర్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. 

కేవలం చిన్న పిల్లల పత్రికే అయినా పెద్దలు కూడా ప్రతి నెలా చందమామకోసం ఎదురు చూసే వాళ్లు.  చిన్నారుల్లో నీతి, నిజాయితీ వంటి మంచి లక్షణాలు పిల్లలకు అలవడేలా  చందమామను తీర్చిదిద్దేవాళ్లు. చరిత్ర, పురా ణాలకు సంబంధించిన విషయాలను కూడా
పత్రికలో కథలు, ధారావాహిక రూపంలో అందించేవాళ్లు.

చందమామ కథలు

చందమామలో ప్రచురించే కథలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. ముఖ్యంగా జానపద కథలో రాజులు, మంత్రులు, సైన్యా ధ్యక్షులు, మంత్రగాళ్లు... వాళ్లు వేసే ఎత్తులు... పైఎత్తులు, యుద్ధాలు, సాహసాలు, ఆకట్టుకునేలా సాగేవి. పోటీలు, పోరాటాలు, నవ్వు తెప్పించే సన్నివేశాలతో కథలు పిల్లలను కట్టిపడేసేవి. అమాయకమైన పాత్రలు చేసే పనులు ఆపక్తితో ఆలోచింపజేసేవి. తెలివితేటలను పెంచేవి.

ఇక కథలో, సీరియల్స్ లోని దెయ్యాలు అవి -చేసే వింత పనులు, మంచి కార్యాలు పిల్లలను భయపెట్టేవి కావు. సంతోషం కలిగించేవి మూఢనమ్మకాలు పెంచేవి కావు. ఆలోచనలకు పదును పెట్టేవి. కథల్లో ఎక్కువగా రైతులు, సామాన్యుల బతుకులు కనిపించేవి. ఊహాలోకాలు, మంత్రినగరి రహస్యాలతో ఎంతో.. అద్భుతంగా పిల్లలను అలరించేవి. 

ధారావాహికలు

చందమామలో వచ్చే ధారావాహికలు నెలల తరబడి సాగేవి.   ప్రాచీన జానపద కథలు. అరేబియన్ నైట్స్, బౌద్ధ జాతక కథలు,జైన పురాణాలు, భారతం, రామాయణం.. ఉపనిషత్తుల్లోని అనేక విషయాలను కథల రూపంలో బాలబాలికలకు అర్థమయ్యే రీతిలో ఇచ్చే వాళ్లు.

 కాళిదాసు, భానుడు లాంటి కవులు రచించిన సంస్కృత నాటకాలతోపాటు, షేక్ స్పియర్ లాంటి ప్రసిద్ధి చెందిన ఆంగ్ల రచయితల నాటకాలను కూడా  కథలుగా ప్రచురించే వాళ్లు. గ్రీకు నాటకాలు కూడా చిన్నచిన్న కథల రూపంలో పిల్లల మనసుకు హత్తుకునేలా ముద్రితమయ్యేవి. ఇక బేతాళకథలు ఎంతో ఆకట్టుకునేవి. ఎన్నో ధారావాహికలు చందమామకు వెలుగును తెచ్చాయి.

భాష

ఆ రోజుల్లో ఏ భాష నేర్చుకోవాలన్న చందమాను చదువు అని పెద్దలు చెప్పే వాళ్లు ఇక తెలుగు భాషలోని అందమైన నుడికారాలు, సామెతలు జాతీయాలు కథల్లో సందర్భాను సారంగా ఉండేవి. కథలైనా సీరియల్స్ అయినా మొదటి నుంచి చివరి వరకు చిన్న ప్రవాహంలా సాగిపోయేవి. కథలోని ప్రధాన విషయం సులభంగా పిల్లలకు అర్ధమయ్యేది. పాత్రల పేర్లు కూడా వాటి స్వభావాన్ని బట్టి ఉండేవి.

చిత్రకారులు

మొదటి నుంచి చందమామ పత్రికలో బొమ్మలకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు నాగిరెడ్డి ప్రతిపేజీలో బొమ్మ ఉంచాలని, పాత్రల స్వభావం బొమ్మలో కన పడాలని చెప్పేవాళ్లు, తర్వాత వచ్చిన ఎన్నో పత్రికలు ఈ పద్ధతినే కొనసాగిస్తూ వచ్చాయి... వస్తున్నాయి. 

పిల్లల స్కూలు పుస్తకాలకు కూడా ఇదే ఒరవడి. చిత్రా (టి.వి. రాఘవన్) మొదట చందమామ పత్రికకు చిత్రకారుడు చిత్రవిచిత్రంగా ఉండే విచిత్ర మనుషులు, భల్లూకాలు వంటి ఎన్నింటికో బొమ్మల రూపంలో ప్రాణం పోశాడు. బేతాళకథలలో విక్రమార్కుడు చేతిలో కత్తిపట్టుకొని, భయంకరమైన శ్మశానంలో చెట్టుకింద నిలబడి శవాన్ని మోస్తూ ఉంటాడు.

 ఆ బొమ్మను చేసిన వ్యక్తి శంకర్. ఆ తర్వాత సహ (వడ్డాది పాపయ్య) చాలాకాలం చంద్రమామకు బొమ్మలు వేశాడు. ఎం.టి.వి. ఆచార్య చందమామలో వచ్చిన 'మహాభారతం' సీరియల్ కు బొమ్మలు గీశాడు. బాపు కూడా కొంతకాలం పనిచేశాడు. భీష్మ సినిమాలో ఎన్టీ రామారావు పాత్ర వేషానికి చందమామలోని బొమ్మే కారణమట.

తగ్గని వెలుగు 

మొదట తెలుగు, తమిళ భాషల్లో మాత్రమే మొదలైన చందమామ తర్వాత హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ లాంటి భాషలను కలుపుకొని మొత్తం 17 భాషల్లో వచ్చేది. బ్రెయిలీ లిపిలోనూ వచ్చింది. సంతాలీ లాంటి గిరిజన భాషలో వెలువడిన పత్రిక కూడా ఇదే. అనివార్య కారణాల వల్ల అక్టోబర్ 1998 నుంచి నవంబర్ 1990 వరకు ఆగిపోయింది. అయినా మళ్లీ డిసెంబ ర్ 1999లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికగా మాత్రమే వెలువడుతోంది.