- భద్రాచలం జిల్లాలో 25 వేల ఎకరాల్లో సాగు చేసిన మిరప పంట
- ఎకరం పంటలో సుమారు 40 శాతం వరకు తెగులు
- ఆందోళనలో అన్నదాతలు
భద్రాచలం, వెలుగు : జిల్లాలో రైతులు సాగు చేసిన మిరప పంటకు తెగులు రావడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఊరిస్తున్న మిర్చి ధరలకు ఈ తెగుళ్ల ఇబ్బందిగా మారాయి. ఈ ఏడాదైనా పెట్టుబడులు వస్తాయనుకున్న సమయంలో ఒక్కసారిగా నల్లి పురుగు తెగులు దాడి చేయడంలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
ఎకరం పంటలో సుమారు 40 శాతం వరకు తెగులుకు గురైంది. ఈ ఫలితంగా దిగుబడిపై ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. ఎకరానికి 8 క్వింటాళ్లు కూడా మిరపకాయలు వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. దీనితో అప్పుల పాలు కాక తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 25 వేల ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు.
వాతావరణం అనుకూలించక...
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం నల్లరేగడి నేలలు మిరప పంట సాగుకు అనువుగా ఉంటాయి. ఇక్కడ సాగైన మిర్చికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వాతావరణం అనుకూలించక మిర్చి పంట సాగు ముందూ, వెనుక అయ్యింది. గోదావరికి రెండు సార్లు వరదలు రావడం వల్ల కొందరు సెప్టెంబర్ మొదటి వారం, మరికొందరు అక్టోబర్ రెండో వారంలో మిర్చి సాగు చేశారు. నల్లిపురుగు తెగులు కారణంగా తోటలు ఎండిపోతున్నాయి.
ముందు సాగు చేసిన రైతులకు దీని ప్రభావం తక్కువగా ఉంది. తర్వాత సాగు చేసిన వారికి మాత్రం నష్టం ఎక్కువగా కన్పిస్తోంది. ముందుసాగు చేసిన వాళ్లకు ఇప్పటికే మిరపకాయలు రెండు సార్లు కోతలు జరిగాయి. ఎకరం పంటలో సుమారు 12 క్వింటాళ్ల వరకు వారికి దిగుబడులు వచ్చాయి. రెండోసారి సాగు చేసిన వారికి మాత్రం కేవలం 8 క్వింటాళ్లు మాత్రమే వస్తున్నాయి. పంటకు తెగులు రాకపోతే ఎకరానికి 20 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడులు వచ్చేవి.
దిగుబడి దారుణంగా ఉంది..
నల్లిపురుగు కారణంగా మిరప పంట దిగుబడి దారుణంగా ఉంది. ఎకరం పంటలో 40 శాతం వరకు తెగుళ్లు సోకాయి. ఇప్పుడున్న రేటు స్థిరంగా ఉంటే గట్టెక్కవచ్చు. లేకుంటే మాత్రం ఎప్పటిలాగే అప్పుల బాధలు తప్పవు. ఈ గండం నుంచి గట్టెక్కడం ఎలాగో అర్థం కావడం లేదు. – బి.రవికుమార్, రైతు, దుమ్ముగూడెం
ధరపైనే రైతుల భవితవ్యం..
మార్కెట్లో మిర్చి ధరపైనే రైతుల భవితవ్యం ఆధారపడి ఉంది. ప్రస్తుతం క్వింటాల్మర్చికి రూ.18 వేల నుంచి రూ.23 వేల వరకు ధర పలుకుతోంది. ఇదే ధర కొనసాగితే రైతులకు శ్రమ పోయినా కనీసం పెట్టుబడి అయినా దక్కుతుంది. ఎకరానికి కనీసం రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులకు అదనంగా మరో రూ.20 వేలు ఎక్కువ ఉంటుంది. ఎకరానికి 8 క్వింటాళ్లు వచ్చినా అప్పుల బాధ ఉండదు. కానీ ధర తగ్గితే మాత్రం రైతులకు కష్టాలు తప్పవు.
