- బారక్‌లు, రాడార్ పొజిషన్ల నిర్మాణం
- శాటిలైట్ ఫొటోలతో వెలుగులోకి
- టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సుకు తూర్పు వైపున నిర్మాణాలు
న్యూఢిల్లీ: ఇండియా బార్డర్ లో చైనా కొత్తగా ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నది. కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్లు, బారక్‌లు, వెహికల్ షెడ్లు, ఆయుధాలు భద్రపర్చేందుకు ప్రత్యేక గదులు, రాడార్ పొజిషన్లు, మిసైల్ లాంచ్ సైట్లు సైతం ఏర్పాటు చేసుకుంటున్నది. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. లడఖ్ లోని పాంగాంగ్ సరస్సుకు తూర్పు వైపున ఈ నిర్మాణాలు ఉన్నాయి. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో 2020లో ఇండియా, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన ప్రాంతానికి ఈ కాంప్లెక్స్ 110 కి.మీ. దూరంలోనే ఉంది. గార్ కౌంటీ వద్ద కూడా మరో కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు శాటిలైట్ ఫొటోలతో స్పష్టమవుతున్నది. ఇది ఎల్ఏసీకి 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ట్రాన్స్పోర్టర్ ఎరెక్టర్ లాంచర్ (టీఈఎల్) వెహికల్స్ కోసం ప్రత్యేకంగా స్లైడింగ్ పైకప్పులతో స్థావరాలను చైనా నిర్మిస్తున్నది. ఒక్కో లాంచ్ బేస్‌లో రెండు వెహికల్స్‌ను పార్క్ చేసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నది. మిసైళ్లను పైకి ఎత్తడం, మోసుకెళ్లడం, వాటిని ప్రయోగించేందుకు టీఈఎల్ వెహికల్స్ ఉపయోగపడ్తాయి. ఇండియా బార్డర్లో ఉన్న న్యోమా ఎయిర్ ఫీల్డ్‌లకు ఎదురుగానే ఈ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతున్నది. చైనా నిర్మిస్తున్న ఈ కాంప్లెక్స్‌లు హెచ్‌క్యూ9 సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ సిస్టమ్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఇవి లాంగ్-రేంజ్ ఎయిర్ డిఫెన్స్‌కు ఉపయోగపడ్తాయి. ఇప్పటికే వీటి నిర్మాణం దాదాపు పూర్తయినట్టుగా ఫొటోలను బట్టి తెలుస్తోంది.
