V6 News

ముంచేస్తున్న చైనా ఉత్పత్తులు.. నష్టాలు భరించలేక 3వేల మందిని పీకేసిన ఇంక్ తయారీ కంపెనీ

ముంచేస్తున్న చైనా ఉత్పత్తులు.. నష్టాలు భరించలేక 3వేల మందిని పీకేసిన ఇంక్ తయారీ కంపెనీ

భారత్ 'మేక్ ఇన్ ఇండియా' అంటూ పారిశ్రామికంగా ఎదగాలని ప్రయత్నిస్తుంటే.. సరిహద్దు అవతల నుంచి వస్తున్న చౌక ఉత్పత్తుల డంపింగ్ స్థానిక కంపెనీల వెన్ను విరుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో బయటకొచ్చిన ఒక విషయం భారతీయ తయారీ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతోంది. 34 ఏళ్ల చరిత్ర ఉన్న ఒక ఇంక్ తయారీ సంస్థ.. చైనా పోటీని తట్టుకోలేక లేఆఫ్స్ చేపట్టడం పారిశ్రామిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దాదాపు 34 ఏళ్లుగా విజయవంతంగా నడుస్తున్న ఒక స్వదేశీ కంపెనీ, గత మూడేళ్లుగా నిరంతర నష్టాల్లో కూరుకుపోయింది. కారణం ఒక్కటే.. చైనా నుండి దిగుమతి అవుతున్న అత్యంత చౌకైన ఉత్పత్తులు. మన దేశీయ కంపెనీలు నాణ్యతను కాపాడుకుంటూ ఇచ్చే ధర కంటే.. చైనా కంపెనీలు ఇచ్చే ధరలు చాలా తక్కువగా ఉండటంతో, భారతీయ సంస్థలు మార్కెట్‌లో నిలబడలేకపోతున్నాయి. ఆఖరికి మూడు ప్లాంట్లలో రెండింటిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రోడ్డున పడ్డ వేల కుటుంబాలు..
కంపెనీ నిర్ణయం వల్ల ఏకంగా 1,934 మంది శాశ్వత ఉద్యోగులు, 896 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయారు. అంటే దాదాపు 3వేల కుటుంబాలు ఒక్కసారిగా సంక్షోభంలో పడ్డాయి. కేవలం బ్లూ కాలర్ కార్మికులే కాకుండా, ఐటీ విభాగంలోని 72 మందిలో 64 మందిని తొలగించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. మూడు దశాబ్దాలుగా నిర్మించుకున్న సామ్రాజ్యం కేవలం చైనా డంపింగ్ వల్ల కుప్పకూలిపోవడం బాధాకరం.

సెవెరెన్స్ ప్యాకేజీ: ఉద్యోగుల ఆవేదన
కంపెనీ కొన్నేళ్ల కిందట విదేశాల్లోని టీమ్‌లను తొలగించినప్పుడు భారీ ప్యాకేజీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం భారత్‌లోని తన సొంత ఉద్యోగులకు మాత్రం కేవలం రెండు వారాల జీతం + పని చేసిన ప్రతి ఏడాదికి ఒక వారం జీతం మాత్రమే ఇవ్వాలని నిర్ణయించింది. కంపెనీ పరిస్థితి చూసిన యాజమాని కొడుకు వ్యాపారం నుంచి తప్పుకుని తిరిగి జర్మనీ వెళ్లిపోతున్నట్లు ప్రకటించారు. అతను కంపెనీలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్థానంలో పనిచేస్తున్నారు. 

కంపెనీ పేరు వెల్లడించకపోయినప్పటికీ.. ఇది కేవలం ఒక్క రంగానికే పరిమితం కాలేదు. స్టీల్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల్లోని భారతీయ తయారీదారులు అందరూ ఇవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. చైనా ప్రభుత్వం తమ దేశీయ కంపెనీలకు ఇచ్చే సబ్సిడీల వల్ల, వారు అతి తక్కువ ధరకే ప్రపంచ మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. దీనివల్ల లాభాలు తగ్గిపోవడం, ఉత్పత్తి వ్యయం పెరగడంతో భారతీయ ప్లాంట్లు నిరంతరం నష్టాలను చూస్తున్నాయి.

ప్రస్తుతం ఈ రియల్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భారతదేశంలో తయారీ రంగం మనుగడ సాగించాలంటే ప్రభుత్వ రక్షణ చర్యలు అవసరం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. చైనా ఉత్పత్తులపై యాంటీ-డంపింగ్ సుంకాలను పెంచకపోతే, మరిన్ని స్వదేశీ కంపెనీలు ఇలాగే కనుమరుగయ్యే ప్రమాదం ఉందంటున్నారు. 34 ఏళ్ల వ్యాపారం ముగిసిపోవడం అనేది కేవలం ఒక కంపెనీ ఓటమి కాదు, అది భారతీయ పారిశ్రామిక భద్రతకు ఒక హెచ్చరిక అంటూ మరొకరు కామెంట్ చేశారు.