చైనాలో ​కొత్త రోగం.. వేలాది మందికి సోకిన బ్రూసెల్లోసిస్

చైనాలో ​కొత్త రోగం.. వేలాది మందికి సోకిన బ్రూసెల్లోసిస్
  • 3,245 మందికి సోకిన బ్యాక్టీరియల్​ ఇన్ ఫెక్షన్
  • ఫార్మాస్యుటికల్​ కంపెనీ లీకేజీ వల్లేనన్న అధికారులు
  • ఇన్ ఫెక్షన్ తో జ్వరం,అవయవాల వాపులు

బీజింగ్​: బ్రూసెల్లోసిస్​.. కరోనా వైరస్​ పుట్టిన చైనాలో మోపైన ఇంకో రోగం ఇది. కరోనాను అధికారికంగా ప్రకటించిన కొద్ది నెలల ముందే అక్కడ ఈ బ్యాక్టీరియల్​ ఇన్​ఫెక్షన్​ మొదలైంది. ఓ ఫార్మాస్యుటికల్​ కంపెనీలో జరిగిన లీకేజీ వల్ల బ్యాక్టీరియా జనాలకు సోకింది. గన్షూ ప్రావిన్స్​ రాజధాని అయిన లాంఝౌలో 3,245 మంది దాని బారిన పడ్డట్టు ఆ సిటీ హెల్త్​ కమిషన్​ ప్రకటించింది. ప్రావిన్స్​లోని 21,487 మందికి టెస్టులు చేయగా 15 శాతం మందికి పాజిటివ్​గా తేలినట్టు చెప్పింది. పోయినేడాది జులై, ఆగస్టు నెలల్లో లాంఝౌలోని ఝోంగ్ము లాంఝౌ బయాలాజికల్​ ఫార్మాస్యుటికల్​ ఫ్యాక్టరీలో జరిగిన లీకేజే దానికి కారణమని పేర్కొంది. పశువుల కోసం బ్రూసెల్లా వ్యాక్సిన్​ను తయారు చేసే క్రమంలోనే ఈ బ్యాక్టీరియా లీకైందంటున్నారు. డేట్​ దాటిపోయిన డిసిన్​ఫెక్టెంట్లు, శానిటైజర్లు వాడడంతో వేస్ట్​గ్యాస్​లోని బ్యాక్టీరియా మొత్తం చనిపోలేదని, దీంతో అది బయటకు వ్యాపించిందని చెబుతున్నారు.

ఏంటీ బ్రూసెల్లోసిస్​?

బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా నుంచి ఈ బ్రూసెలోసిస్​ ఇన్​ఫెక్షన్​ సోకుతుంది. దీన్నే మాల్టా ఫీవర్​, మెడిటెరేనియన్​ ఫీవర్​ అని కూడా పిలుస్తారు. బ్రూసెల్లా బ్యాక్టీరియాలో ఐదు రకాలున్నాయి. బ్రూసెల్లా అబార్టస్​, బ్రూసెల్లా కేనిస్​, బ్రూసెల్లా మెలిటెన్సిస్​, బ్రూసెల్లా ఓవిస్​, బ్రూసెల్లా సూయిస్​. అన్నింటిలోకి బీ మెలిటెన్సిస్​ తీవ్రత చాలా ఎక్కువని చెబుతున్నారు నిపుణులు. పాడి పశువులు, మేకలు, గొర్రెలు, పందుల వంటి వాటికి ఈ బ్యాక్టీరియా సోకుతుందని అంటున్నారు. అయితే, మనుషుల నుంచి మనుషులకు బ్రూసెల్లోసిస్​ వ్యాపించడం చాలా అరుదని అమెరికా సెంటర్స్​ ఫర్​ డిసీజ్​ కంట్రోల్​ అండ్​ ప్రివెన్షన్​ (సీడీసీ) చెబుతోంది. పశువుల నుంచే బ్యాక్టీరియా జనాలకు సోకుతుందని పేర్కొంది. పాడైపోయిన మాంసం తినడం, బాగా కాగబెట్టని పాలు తాగడం, బ్యాక్టీరియాతో నేరుగా కాంటాక్ట్​ అవడం వల్లే సోకుతుందని చెప్పింది. బ్యాక్టీరియా సోకిన పశువులను తాకినా, వాటి రక్తాన్ని ముట్టుకున్నా బ్రూసెల్లోసిస్​ వస్తుందంటున్నారు నిపుణులు. పశువుల పెంపకందార్లతో పాటు వెటర్నరీ డాక్టర్లు, పాడి రైతులు, మాంసం అమ్మేవాళ్లకు ఇది ఎక్కువగా వస్తుందంటున్నారు. అయితే, సోకిన మొదట్లో దీనిని గుర్తించడం చాలా కష్టమని చెబుతున్నారు. 1980ల నుంచే చైనాలో ఈ బ్రూసెల్లోసిస్​ జబ్బు ఉంది. ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడం, జబ్బు కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో ఆ కేసులు బాగా తగ్గాయి. బ్రూసెల్లోసిస్​ పుట్టింది మాత్రం యూరప్​లోని మాల్టాలో. క్రిమియా వార్​ జరిగేటప్పుడు 1850లో ఆ బ్యాక్టీరియా ఇన్​ఫెక్షన్​ తొలిసారి వెలుగు చూసింది. 2008లో బోస్నియాలో దాదాపు వెయ్యి మంది దాని బారిన పడ్డారు. అమెరికాలో ఇన్​ఫెక్షన్​ వల్ల కొన్ని వందల కోట్ల నష్టం కలుగుతోందట. ఎల్లోస్టోన్​ నేషనల్​ పార్క్​లోని 60 శాతం ఆడ జడల బర్రెలకు బ్రూసెల్లోసిస్​ ఉందని అధికారులు చెబుతున్నారు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్​ (మాల్టా, ఐర్లాండ్), న్యూజీలాండ్​లలోనూ గతంలో దాని ప్రభావం ఉండేది.

జీవాయుధంగా

20వ శతాబ్దం మధ్యలో బ్రూసెల్లా బ్యాక్టీరియాను కొన్ని పెద్ద దేశాలు జీవాయుధంగానూ తయారు చేసి పెట్టుకున్నాయి. తొలిసారి 1954లో బీ సూయిస్​తో బయో వెపన్​ను తయారు చేసింది అమెరికా. అయితే, 1971–72లో అన్ని బయోవెపన్స్​ను నాటి ప్రెసిడెంట్​ రిచర్డ్​ నిక్సన్​ నాశనం చేయించారు. బ్రూసెల్లాతో మూడు జీవాయుధాలను తయారు చేసింది యూఎస్​. పోర్సైన్​ బ్రూసెల్లోసిస్​ (ఏజెంట్​ యూఎస్​), బొవైన్​ బ్రూసెల్లోసిస్​ (ఏజెంట్​ ఏఏ), కాప్రిన్​ బ్రూసెల్లోసిస్​ (ఏజెంట్​ ఏఎం) అనే మూడు రకాల బయో వెపన్స్​ను తయారు చేసింది. రెండో ప్రపంచ యుద్ధం నాటికే ఏజెంట్​ యూఎస్​ తయారీ అడ్వాన్స్​ దశకు చేరుకుందట. ఏజెంట్​ యూఎస్​, ఏజెంట్​ ఏఏలతో పోలిస్తే.. ఏజెంట్​ ఏఎం తీవ్రత ఎక్కువట.

లక్షణాలేంటి?..  మనకు ముప్పేనా?

చాలా జబ్బులకు ఉండే లక్షణాలే బ్రూసెల్లోసిస్​కూ ఉన్నాయి. అయితే, అందులో కొన్ని లక్షణాలు జీవితాంతం అలాగే ఉండిపోయే ముప్పుందని యూఎస్​ సీడీసీ చెబుతోంది. తలనొప్పి, కండరాల నొప్పులు, జ్వరం, అలసట, నీరసం వంటివి కామన్​గా ఉండే లక్షణాలని నిపుణులు చెబుతున్నారు. పిత్తాశయం (స్ప్లీన్​), గుండె, లివర్​, టెస్టికిల్స్​ (వృషణాలు) వంటి అవయవాలు వాస్తాయని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇన్​ఫెర్టిలిటీ (సంతాన సమస్యలు) వంటి తీవ్రమైన నష్టాలూ కలుగుతాయంటున్నారు. స్పాండిలైటిస్​ వంటి దీర్ఘకాలిక రోగాలూ వస్తాయంటున్నారు. 70% కేసుల్లో జీర్ణాశయ సమస్యలు వేధిస్తాయంటున్నారు. వాంతులు, విరేచనాలు, ఆకలి కాకపోవడం వంటి సమస్యలుంటాయన్నారు.