
- సౌలతులు కల్పించాకే రిజర్వాయర్ కంప్లీట్ చేయాలని డిమాండ్
గద్వాల, వెలుగు: ఆర్అండ్ఆర్ సెంటర్ లో అన్ని సౌలతులు కల్పించాకే రిజర్వాయర్ నిర్మాణాన్ని కంప్లీట్ చేయాలని శనివారం చిన్నోనిపల్లి నిర్వాసిత కుటుంబాలు పురుగుల మందు డబ్బాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ పనులను అడ్డుకున్నారు. నిర్వాసితులు మాట్లాడుతూ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం 101వ ప్యాకేజీ లో భాగంగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ కోసం 18 ఏండ్ల క్రితం పనులు మొదలుపెట్టారన్నారు. పనులు పూర్తి కాకపోవడంతో రిజర్వాయర్ రద్దవుతుందని తామంతా అక్కడే ఉన్నామన్నారు.
ఎలాంటి ఆయకట్టులేని రిజర్వాయర్ను రద్దు చేయాలని ఏడాదికి పైగా నిరసనలు తెలిపామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయకట్టు లేని రిజర్వాయర్నిర్మించి 4,000 మందిని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తోందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, కానీ, గ్రామానికి కేటాయించిన ఆర్అండ్ఆర్ సెంటర్ లో ఎలాంటి సౌలతులు కల్పించలేదన్నారు. గ్రామాన్ని ఖాళీ చేయించకుండా రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే రేపటి రోజున జరిగే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
వట్టెం ప్రాజెక్టుకు ఇచ్చిన జీవోనే చిన్నోనిపల్లి రిజర్వాయర్ ముంపు వాసులకు ప్రకటించాలని డిమాండ్ చేశారు. తర్వాత ఇరిగేషన్ డీఈ ఉపేంద్రకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మరోవైపు తమంతో కలిసి రావడం లేదని చిన్నోనిపల్లి సర్పంచ్ ఉమా దేవేందర్ ఇంటిని ముట్టడించారు. తాను వచ్చి పనులను అడ్డుకుంటే తమ పార్టీ నుంచి, కలెక్టర్ నుంచి ఫోన్లు వస్తాయని చెప్పడంతో నిన్ను మీ పార్టీ లేదా కలెక్టర్ సర్పంచ్ చేయలేదు. మేము ఎన్నుకుంటేనే అయ్యావ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.