- చొప్పదండిలో కనీస సౌకర్యాల్లేక ప్రజల ఇబ్బందులు
- అభివృద్ధి పరుగులు పెట్టించాలంటున్న పట్టణవాసులు
చొప్పదండి, వెలుగు: నియోజకవర్గ కేంద్రం చొప్పదండి మున్సిపాలిటీ ఏర్పడి ఏడేళ్లయినా ఇప్పటికీ ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పట్టణ అభివృద్ధికి చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోగా.. కనీస సౌకర్యాల్లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పాలకవర్గం ఏర్పాటు అయింది. దీంతోపాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా అధికార పార్టీకి చెందినవారే కావడంతో చొప్పదండి అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆశిస్తున్నారు.
పట్టణంలో ప్రధాన సమస్యలివీ..
- చొప్పదండి టౌన్‌లో గత ప్రభుత్వ హయాంలో రూ.33కోట్లతో సెంట్రల్ లైటింగ్, ఇరువైపులా డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఇది జరిగి నాలుగేళ్లవుతున్నా డివైడర్, డ్రైనేజీ పనులు మాత్రమే పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు కాలేదు. రోడ్డు వెడల్పులో భాగంగా ఇరువైపులా కాంక్రీట్వేసి తారురోడ్డు వేయకుండానే వదిలేయడంతో ప్రజలు దుమ్ముధూళితో బాధపడుతున్నారు.
- అంబేద్కర్ చౌరస్తా నుంచి గుమ్లాపూర్ రోడ్డు వరకు సెంట్రల్లైట్లు ఏర్పాటు చేసి కనెక్షన్ఇవ్వకుండానే పాత స్ట్రీట్ లైట్లు తొలగించారు. దీంతో సుమారు కిలోమీటర్ మేర ఇరువైపులా రోడ్డు చీకటిగా మారింది.
- పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు చేపట్టిన అమృత్2.0 పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ కోసం చాలా వీధుల్లో సీసీ రోడ్లు తవ్వారు. వ్యర్థాలను తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
- పోస్టాఫీసు నుంచి శ్రీరామా టాకీస్ వరకు ఇరుకు రోడ్డుతో ఎదురెదురుగా టూవీలర్లు వెళ్లలేని పరిస్థితి. ఈ రోడ్డును పైపులైన్ల కోసం తవ్వి వదిలేయడం, డ్రైనేజీ సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- వెజ్, నాన్వెజ్ మార్కెట్కోసం మూడేళ్ల కింద నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్పనులు పూర్తిస్థాయిలో కాకపోవడంతో ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
- 1వ వార్డు పరిధిలోని తొగురుమామిడికుంట ప్రాంతానికి వెళ్లేందుకు ఎస్సారెస్పీ కాలువపై గతంలో నిర్మించిన బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. దీనిస్థానంలో కొత్తది నిర్మించాల్సి ఉంది. 13వ వార్డులో 30 ఏండ్ల కింద నిర్మించిన వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరి సిమెంట్ పెచ్చులు ఊడిపడుతున్నాయి.
- పట్టణంలోని చాలా వార్డులు, శివారు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సరైన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. కొత్త పాలకవర్గ సభ్యులైన పట్టణ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
