
- విదేశాల్లో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ లింకులు
- పంజాబ్, రాజస్తాన్, గుజరాత్‌లో ఆర్గనైజర్లు
హైదరాబాద్,వెలుగు: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో నమోదైన బెట్టింగ్ యాప్స్ లింకులు విదేశాల్లో గుర్తించింది. రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌లోని ఆరు ప్రాంతాల్లో గత వారం రోజులుగా సోదాలు నిర్వహించింది. యాప్స్ నిర్వహణతోపాటు బ్యాంక్ అకౌంట్లు ఆపరేట్ చేస్తున్న 8 మందిని అరెస్ట్ చేసింది.
6 ప్రాంతాల్లో సోదాలు.. 8 మంది అరెస్ట్
యాప్స్ డేటాతో ఉన్న హార్డ్ డిస్క్‌లు, బ్యాంక్ అకౌంట్స్, ఫోన్ నంబర్స్ డేటా స్వాధీనం చేసుకున్నది. నిందితులను స్థానిక కోర్టుల్లో హాజరుపరిచి, ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నది. ఈ సోదాల వివరాలను సీఐడీ చీఫ్ చారుసిన్హా బుధవారం వెల్లడించారు.
ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై మార్చిలో సిట్ ఏర్పాటు
రాష్ట్రంలో బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయిన పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆర్థిక నష్టంతోపాటు ప్రాణనష్టం జరుగుతున్నది. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు సీఐడీ చీఫ్ ఆధ్వర్యంలో మార్చి 31న సిట్‌ను ఏర్పాటు చేసింది.
పంజాగుట్ట, మియాపూర్‌సహా రాష్ట్రవ్యాప్తంగా నమోదైన బెట్టింగ్ యాప్స్ కేసుల్లో సీఐడీ సిట్ దర్యాప్తు చేసింది. ఇందులో ప్రధానంగా 4 కేసులకు సంబంధించి తేజ్ 007, ఫెయిర్ ప్లే, ఆంధ్ర365, వీఎల్ బుక్, తెలుగు365, ఎస్ 365 యాప్స్ సహా మరికొన్ని లింక్స్‌ను గుర్తించింది.
విదేశాల నుంచి ఆపరేషన్స్.. రాష్ట్రాల్లో ఆర్గనైజర్లు
సైబర్ నేరగాళ్లు.. విదేశాలను కేంద్రంగా చేసుకొని ఆన్‌లైన్ క్యాసినో, స్పోర్ట్స్ సహా ఇతర బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేస్తున్నారు. యువతతోపాటు సామాన్యులను బెట్టింగ్‌కు అట్రాక్ట్ చేస్తున్నారు. డిజిటల్ వాలెట్స్, యూపీఐ, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చిక్కుకుండా ఆన్‌లైన్ డొమైన్స్ మార్చుతున్నారు. అబ్రాడ్ నుంచి ఆపరేట్ చేస్తున్న యాప్స్‌నువివిధ రాష్ట్రాల్లోని 8 మంది ఆపరేట్ చేస్తున్నట్టు సీఐడీ గుర్తించి వారిని అరెస్ట్ చేసింది.