ఇండియాలోకి మరో విదేశీ వ్యాక్సిన్

ఇండియాలోకి మరో విదేశీ వ్యాక్సిన్

మోడర్నా టీకా అత్యవసర వాడకానికి డీసీజీఐ ఓకే

దిగుమతి చేసుకునేందుకు సిప్లా సంస్థకు అనుమతి
ముంబై: ఇండియాలో మరో విదేశీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది. కరోనాకు అమెరికా కంపెనీ మోడర్నా డెవలప్ చేసిన టీకాను మన దేశానికి దిగుమతి చేసుకునేందుకు ముంబైకి చెందిన ఫార్మా కంపెనీ సిప్లా సిద్ధమైంది. ఇందుకోసం పర్మిషన్ కోరుతూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి అప్లికేషన్ పెట్టుకుంది. దీనిపై డీసీజీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. మన దేశంలో 18 ఏండ్లు పైబడిన వారికి మోడర్నా టీకాను అత్యవసర వాడకానికి (ఎమర్జెన్సీ అప్రోవల్) అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఈ వ్యాక్సిన్ సమర్థత 90 శాతంగా ఉందని ఇప్పటికే పలు స్టడీల్లో తేలింది. దీని స్టోరేజీకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఏవీ అక్కర్లేదు. దీనిని మామూలు ఫ్రిజ్ లో స్టోర్ చేస్తే సరిపోతుంది.
మన దేశంలో తయారైన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను ఇప్పటికే ప్రజలకు వేస్తుండగా, రష్యాకు చెందిన స్పుత్నిక్-వి టీకాను డాక్టర్ రెడ్డీస్ కంపెనీ దిగుమతి చేసుకుంటోంది. స్పుత్నిక్ టీకాను త్వరలోనే ఇండియాలోనూ తయారు చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ కంపెనీ సిద్ధమవుతోంది. తాజాగా సిప్లా కంపెనీ మోడర్నా టీకాను దిగుమతి చేసుకోబోతోంది. మరోవైపు బయోలాజికల్-ఈ, జైడస్ కాడిలా సహా మరికొన్ని స్వదేశీ టీకాలు కూడా త్వరలో మన దేశంలో అందుబాటులోకి రానున్నాయి.