
జాతీయ ఆదాయం అనేది ప్రవాహ భావన. కాబట్టి నిరంతరం ఒక రంగం నుంచి మరో రంగానికి ప్రవహిస్తుంది. ఉత్పత్తి కారకాల సహాయంతో వస్తుసేవలు ఉత్పత్తి అవుతాయి. ఈ ఉత్పత్తి విలువ దానికి దోహదపడిన ఉత్పత్తి కారకాలకు ఆదాయాల రూపంలో చేరుతుంది. ఈ ఆదాయం తిరిగి వస్తుసేవలపై ఖర్చు చేస్తారు. అంటే ఉత్పత్తి ఆదాయాన్ని ఇవ్వగా ఆదాయం వ్యయానికి దోహదపడుతుంది. వ్యయం తిరిగి ఉత్పత్తి, ఆదాయానికి దోహదపడుతుంది.
అంటే ఆర్థిక వ్యవస్థలో వస్తుసేవలు, ఉత్పత్తికారక సేవలు నిరంతరం ఉత్పత్తిదారులు, గృహరంగం మధ్య వినిమయం అవుతాయి. ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల మధ్య వస్తుసేవలు, ఉత్పత్తి కారక సేవలకు చెల్లింపులు, రాబడులు రూపంలో ప్రవహించడమే ఆదాయ చక్రీయ ప్రవాహం. ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని వాస్తవ ప్రవాహం, ద్రవ్య ప్రవాహం అని రెండు రకాలుగా విభజించవచ్చు.
వాస్తవ ప్రవాహం: ఉత్పత్తికారక యజమానులు(కుటుంబ రంగం) నుంచి కారక సేవలు ఉత్పత్తిదార్లకు(సంస్థలకు) ప్రవహిస్తాయి. ఆ ఉత్పత్తికారకాలను ఉపయోగించి తయారు చేసిన వస్తువసేవలు ఉత్పత్తిదార్ల నుంచి కొనేవారికి(గృహ/ కుటుంబరంగం) చేరుతాయి. అంటే కారక సేవలు, వస్తుసేవలు వివిధ రంగాల మధ్య ప్రవహించడమే వాస్తవ ప్రవాహం.
ద్రవ్య ప్రవాహం: ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అన్ని వ్యవహారాలు ద్రవ్యంతోనే నిర్వహించబడతాయి. కుటుంబరంగం సంస్థలకు ఉత్పత్తికారక సేవలు అందించినప్పుడు సంస్థలు కారకాలకు చెల్లింపులు చేస్తాయి. ఇది కుటుంబాలకు కారక ఆదాయం అవుతుంది. సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తుసేవలు కుటుంబాలు కొనుగోలు చేసినప్పుడు వ్యయం జరుగును. అంటే సంస్థలకు ఆదాయం వచ్చును. కారకసేవలకు ద్రవ్య ఆదాయం రాగా, అది వస్తుసేవలపై వ్యయం చేయడం ద్వారా వివిధ రంగాల మధ్య ద్రవ్య ప్రవాహం జరుగును. నిజానికి వాస్తవ ప్రవాహం, ద్రవ్య ప్రవాహం అనేవి ఒక నాణానికి రెండు వైపుల వంటివి. వస్తుసేవల వాస్తవ ప్రవాహం అనేది, దాని వ్యతిరేక దిశలోగల ద్రవ్య ప్రవాహానికి సమానం.
ఉదాహరణకు సంస్థల రంగం 100 కోట్ల వస్తువులను గృహరంగానికిస్తే, గృహరంగం దానిపై 100 కోట్లు వ్యయం చేయును. అంటే కొనుగోలుదారుని వ్యయం, అమ్మకందారుని ఆదాయమవుతుంది. ఆదాయ చక్రీయ ప్రవాహాన్ని వివరించేందుకు ఆర్థిక వ్యవస్థను నాలుగు రకాలుగా విభజించవచ్చు. అవి.. గృహ/ కుటుంబ రంగం, సంస్థలు/ వ్యాపార రంగం, ప్రభుత్వరంగం, విదేశీ రంగం.
గృహరంగం: ఉత్పత్తి కారకాల (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) యజమాని ప్రధానంగా గృహరంగమే. ఇది కారకసేవలను సంస్థలకు అమ్మి బదులుగా ఆదాయన్ని పొందును. ఈ ఆదాయంలో ఎక్కువ భాగం సంస్థలు అందించిన వస్తుసేవలపై వ్యయం చేయును. ఆదాయంలో కొంతభాగం పొదుపు చేసి, కొంత ప్రభుత్వానికి పన్నులుగా చెల్లించును.
వ్యాపార/ సంస్థల రంగం: సంస్థలు కుటుంబరంగం నుంచి కారకసేవలను అద్దెకు తీసుకుని, వాని సహాయంతో వస్తుసేవలు ఉత్పత్తి చేసి వాటిని గృహరంగానికి, ఇతర సంస్థలకు, ప్రభుత్వానికి, ఇతర దేశాలకు విక్రయించును. సంస్థలు ముఖ్యంగా ఉత్పత్తి కారకసేవల కొనుగోలుదారు, వస్తుసేవల ఉత్పత్తిదారు. వ్యాపార రంగంలో ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు కలిసి ఉంటాయి.
ప్రభుత్వరంగం: ప్రభుత్వ రంగం అంటే సాధారణ ప్రభుత్వం(ప్రభుత్వ సంస్థలను మినహాయించాలి). ప్రభుత్వం కుటుంబరంగం, సంస్థల రంగంపై ప్రత్యక్ష, పరోక్ష పన్నులు విధించడం ద్వారా ఆదాయం పొందుతుంది. వస్తు సేవలను సంస్థల నుంచి, ఉత్పత్తికారక సేవలను కుటుంబరంగం నుంచి కొని వ్యయం చేస్తుంది. ఈ వస్తుసేవలను, కారకసేవలను ప్రజల సామూహిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
రెండు రంగాల నమూనా
దీనిని సంపూర్ణ వ్యయ ఆర్థిక వ్యవస్థ అంటారు. ప్రభుత్వరంగం, విదేశీరంగం లేవని, కేవలం గృహరంగం, సంస్థల రంగమే ఉన్నవని ప్రమేయం చేయాలి. ఉత్పత్తికారక యజమాని అయిన గృహరంగం తన కారకసేవలను సంస్థలకు విక్రయించి బాటకం, వేతనాలు, వడ్డీ, లాభాల రూపంలో ఆదాయం పొందును. సంస్థలు ఈ ఉత్పత్తికారకాల సహాయంతో వస్తుసేవలను ఉత్పత్తిచేసి వాటిని కుటుంబాలకు విక్రయిస్తుంది. కుటుంబాలు గతంలో పొందిన కారక ఆదాయాన్ని ఈ వస్తుసేవలపై వ్యయం చేస్తుంది. కుటుంబాలు చేసిన ఈ వ్యయమే సంస్థలకు ఆదాయం.
గృహరంగం: 1. ఉత్పత్తి కారకాలను సప్లయ్ చేస్తుంది. 2. సంస్థల ఉత్పత్తి కొనుగోలు చేసి వినియోగదారులా వ్యవహరిస్తుంది.
సంస్థలరంగం: 1. గృహరంగాలు అందించిన కారకాలకు ప్రతిఫలాన్ని చెల్లిస్తుంది. 2. వస్తుసేవలను ఉత్పత్తి చేస్తుంది.
మూడు రంగాల నమూనా
రెండు రంగాల ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వరంగాన్ని చేరిస్తే మూడు రంగాల ఆర్థిక వ్యవస్థ వస్తుంది. దీనిని పరిపాలనా ఆర్థిక వ్యవస్థ అంటారు.
పన్నులు: ప్రభుత్వం అనేది కుటుంబరంగం, సంస్థల రంగంపై పన్నులు విధించడం ద్వారా ఆదాయం పొందుతుంది. పన్నులు చెల్లించడం వల్ల కుటుంబాలు, సంస్థలు చేసే వ్యయం తగ్గుతుంది. ఫలితంగా ఆదాయ ప్రవాహం తగ్గుతుంది.
ప్రభుత్వ వ్యయం: పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కుటుంబ, సంస్థల రంగంపై ప్రభుత్వం వ్యయం చేస్తుంది. ఎ. కుటుంబాలు అందించే ఉత్పత్తి కారక సేవలపై వేతనాలు, జీతాలు రూపంలో వ్యయం చేస్తుంది. కుటుంబాలపై బదిలీ చెల్లింపుల రూపంలో(ఉదా: వృద్ధాప్య పింఛన్లు, నిరుద్యోగ భృతి, స్కాలర్షిప్లు) వ్యయం చేస్తుంది. బి. సంస్థలు ఉత్పత్తి చేసే వస్తుసేవలపై వ్యయం చేయడం ద్వారా, సంస్థలకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వ్యయం చేస్తుంది.
బదిలీ చెల్లింపులతో ప్రభుత్వం నుంచి కుటుంబాలకు, సంస్థలకు ద్రవ్య ప్రవాహం ఉంటుంది. కానీ, వాటి నుంచి ప్రభుత్వానికి ఎలాంటి వాస్తవ ప్రవాహం ఉండదు. ప్రభుత్వ వ్యయం వల్ల ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. ప్రభుత్వం తనకు వచ్చిన ఆదాయాన్నంతా(పన్నులు) తిరిగి వ్యయం, బదిలీ చెల్లింపుల రూపంలో వ్యయం చేస్తే ఆదాయ ప్రవాహం సమతౌల్యంలో ఉంటుంది.
నాలుగు రంగాల నమూనా
ప్రతి దేశంలో విదేశీ వ్యాపారం ముఖ్య పాత్ర పోషిస్తుంది. గృహ, సంస్థల, ప్రభుత్వరంగానికి విదేశీ వ్యాపారం చేరిస్తే అది ఓపెన్ ఎకానమీగా పిలుస్తారు. విదేశీ వ్యాపారం లేని ఆర్థిక వ్యవస్థను అటార్కీ అని కూడా అంటారు. విదేశీ వ్యాపారంలో రెండు వ్యవహారాలు ఉంటాయి. ఎ. వస్తుసేవల ఎగుమతులు, బి. వస్తుసేవల దిగుమతులు. వస్తుసేవల ఎగుమతుల వల్ల విదేశాల నుంచి ఆదాయం వస్తుంది. దీనివల్ల దేశంలో ఆదాయ ప్రవాహం పెరుగుతుంది. వస్తువుల దిగుమతుల వల్ల దేశంలో జరిగే వ్యయం విదేశాలకు పోతుంది. అంటే ఆదాయం విదేశాలకు పోవడంతో ఆదాయ ప్రవాహం తగ్గుతుంది.