భారతదేశ రైతులకు ఆపద వచ్చిందా? ఇప్పటికే గిట్టుబాటు ధరలు లేక దేశ రైతులు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వారు మరింత ఆర్థికంగా కుదేలయ్యే పరిస్థితి వచ్చిందా? ఈ సందేహాలకు కారణం భారత్, అమెరికాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందమే.
దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందంలో వ్యవసాయ రంగ ఉత్పత్తులను చేర్చడం ఇదే మొదటిసారి. ఇది భారత రైతులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతోపాటు దేశంలోని ప్రతిపక్ష నాయకులు, సంయుక్త కిసాన్ మోర్చాతోపాటు పలు రైతు సంఘాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మరీ ఈ ఒప్పందానికి ఒప్పుకున్నారని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది. దీని నుంచి గట్టెక్కడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాల మీద ఇష్టారీతిన టారిఫ్‌లు విధిస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కన్ను భారతదేశంలోని వ్యవసాయ మార్కెట్‌పై పడింది. ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోదీ పూర్తిగా సరెండర్ అయిపోయారని ప్రతిపక్షాలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒప్పందం దేశ రైతులను ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుందని సంయుక్త కిసాన్ మోర్చా హెచ్చరిస్తోంది.
ట్రేడ్ డీల్ నేపథ్యం..
ఈ వాణిజ్య ఒప్పందం గురించి మొదటగా ఫిబ్రవరి 2న ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో అమెరికా దేశ రైతులకు లాభం జరుగుతుందని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్ ద్వారాలు తెరిచేలా చేశామని తెలిపారు. అమెరికా దేశ మంత్రులు కూడా ఈ ఒప్పందం అమెరికా దేశ రైతులను బలోపేతం చేస్తుందని, భారత వ్యవసాయ మార్కెట్ తమ గుత్తాధిపత్యంలోకి రాబోతుందని ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేశారు.
దీంతో అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు చౌకగా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే... దేశ రైతులు ఆర్థికంగా చితికిపోతారని రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ ఒప్పందంలో ఏం ప్రయోజనాలు ఉన్నాయో దేశ ప్రజలకు స్పష్టంగా చెప్పడానికి వెనకాడుతోంది. గత పది రోజుల నుంచి ఈ ఒప్పందంపై దేశంలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కానీ, ప్రధాని మోదీ మాత్రం మౌనం వీడడం లేదు.
మార్చిలో ఒప్పందంపై సంతకాలు
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఇద్దరూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ ఒప్పందం వల్ల భారత రైతులకు ఎలాంటి నష్టం లేదని, అమెరికా మన దేశం ఎగుమతులపై విధించే టారీఫ్ 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిందని, ఇది చాలా గొప్ప విజయం అని ప్రకటించుకోవడం ఒక విచిత్రం. ట్రంప్ కంటే ముందు భారత వస్తువులపై అమెరికా 3 శాతం మాత్రమే టారిఫ్ విధించేది.
ఇపుడు ఇరుదేశాల మధ్య మధ్యంతర అంగీకారం జరిగిందన్నారు. మార్చి నెలలో పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేస్తారనేది సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను మన దేశం కొనుగోలు చేస్తుంది. వీటిపై జీరో టారిఫ్ ఉంటుంది. దీని అర్థం భారత మార్కెట్లో అమెరికా ఆధిపత్యానికి దారులు తెరిచినట్టే.
అమెరికా భారత్ కి ఎగుమతి చేసే వ్యవసాయ ఉత్పత్తులలో మొక్కజొన్నలు, ఎర్ర జొన్నలతో చేసే యానిమల్ ఫీడ్, బాదం, జీడిపప్పు లాంటి ట్రీనట్స్, ఆపిల్, ద్రాక్ష పండ్లు, సోయాబీన్ నూనె, కొన్ని రకాల పప్పు ధాన్యాలు ఉన్నాయి. ఇప్పటికే అమెరికా మొక్కజొన్న, గోధుమ, పత్తి, సోయాబీన్ భారత్ ఎగుమతి చేస్తూనే ఉంది. ఇక ఈ వాణిజ్య ఒప్పందం ప్రకారం మరిన్ని వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం ఎగుమతి చేస్తే, దేశ రైతులు దివాలా తీయడం ఖాయం అనిపిస్తుంది.
ఒకవైపు చైనా, మరొకవైపు అమెరికా..
అమెరికా గతం కంటే మూడు రెట్లు అధికంగా భారత్‌లో విక్రయాలు చేయబోతోంది. ఇప్పటివరకు భారత మార్కెట్లో చైనాది అగ్రస్థానం. ఈ ఒప్పందం అమలైతే అమెరికా మొదటి స్థానంలోకి వస్తుంది. ఒకవైపు చైనా, మరొకవైపు అమెరికా భారత వ్యవసాయ మార్కెట్‌ని తమ గుత్తాధిపత్యంలోకి తీసుకున్న తర్వాత భారత రైతులు తట్టుకోగలరా?
ప్రస్తుతం దేశంలో పశుగ్రాసంలో ముఖ్యమైన స్థానం మొక్కజొన్న, ఎర్ర జొన్నలది. అమెరికా నుంచి యానిమల్ ఫీడ్ భారీగా దిగుమతి అయితే, దీనిపై అమెరికాకు గుత్తాధిపత్యం లభిస్తుంది. అమెరికా నుంచి ఆపిల్ పండ్లను అనుమతిస్తే హిమాచల్ లోని లక్షల మంది రైతుల పరిస్థితి, ద్రాక్ష దిగుమతి అయితే మహారాష్ట్రలో ఈ రైతుల పరిస్థితి, సోయాబీన్ నూనెను అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటే మధ్యప్రదేశ్ సోయాబీన్ రైతుల పరిస్థితి ఏం కానుంది?
మేకిన్ ఇండియా నినాదం ఎటుపోయింది?
ఒప్పందంలో మరో ముఖ్యమైన అంశం, రష్యా నుంచి భారత్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చమురును కొనుగోలు చేయకూడదు. అమెరికా, వెనెజువెలా నుంచి చమురును కొనుగోలు చేయాలని అగ్రిమెంట్లో ఆదేశించడం భారత సార్వభౌమాధికారాన్ని పరిహాసం చేయడమే. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అమెరికా, వెనెజువెలా నుంచి అధిక ధరకు కొనడం దేశ ఆర్థిక ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే. ఈ ఒప్పందంపై ప్రధాని మోదీ పార్లమెంటులో కానీ, మీడియా ముఖంగా కానీ ఇప్పటివరకు మాట్లాడలేదు.
పార్లమెంటు సభ్యులతో పాటు దేశంలోని రైతులు కూడా అయోమయంలో ఉన్నారు. దేశ మార్కెట్‌ను చైనా, అమెరికాలకు అప్పగించి ఆత్మనిర్భర్ భారత్ ఎలా సాధిస్తారు? మేకిన్ ఇండియా నినాదం ఎటు పోయింది? వీటిపై దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.
- నుమాన్ మహమ్మద్, ఏఐసీసీ జాతీయ కో ఆర్డినేటర్-
