- వడ్ల సేకరణ విధివిధానాలపై చర్చ
- 25 శాతం బ్యాంక్ గ్యారంటీకి మిల్లర్లు ససేమిరా!
- వారంలో మిల్లర్లతో మరో మీటింగ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సీజన్లో చేపట్టే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి సివిల్ సప్లయిస్ డిపార్ట్మెంట్ చర్యలు వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 7వేలకు పైగా కొనుగోలు సెంటర్ల ఏర్పాటు బాధ్యతను ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లకు అప్పగించింది. ఈ వానాకాలంలో వరి సాగు భారీగా జరిగిన నేపథ్యంలో కోటిన్నర టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నది. సుమారు కోటి టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తుందని అంచనా వేస్తుంది. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సర్కారు గైడ్లైన్స్ రూపొందించి సన్నాహాలు చేస్తున్నది. దీనిలో భాగంగా మంగళవారం సివిల్ సప్లయిస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
బాయిల్డ్ రైస్ మిల్లర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ధాన్యం సేకరణ విధివిధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటాయించే ధాన్యంలో 25శాతం బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలనే దానిపై మిల్లర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని క్లియర్గా ఉన్న మిల్లర్లకు ఈ నిబంధనలను అమలు చేయెద్దని కోరారు. 10శాతం మాత్రమే అమలు చేయాలని కొందరు మిల్లర్లు కోరారు. సన్న ధాన్యం కొనుగోళ్ల నేపథ్యంలో తేమ శాతం 17శాతం ఉంటే ఔటర్న్ తక్కువగా వస్తుందనీ, స్టాక్ చేస్తే ముక్కవాసన రావడంతో పాటు కలర్ మారుతుందన్నారు. సన్న బియ్యం 54 శాతమే వస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో 14శాతం తేమ ఉండేలా నిబంధనలు సవరించాలని కోరారు. అదే విధంగా గన్నీ బ్యాగుల రేట్లపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
రూ.9 నుంచి రూ.12వరకు ధర ప్రకటించాలని కోరారు. కస్టోడియన్గా వ్యవహరిస్తున్న మిల్లర్లకు కస్టోడియన్ చార్జీలు ఇవ్వాలని కోరారు. గతంలో మిల్లింగ్ లాస్ భరిస్తామని చెప్పి అమలు చేయలేదనీ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని కోరారు. దీనికి కమిషనర్ డీఎస్ చౌహన్ స్పందిస్తూ మరో వారంలో హైలేవల్లో ప్రభుత్వంతో మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయం ప్రకటిస్తామన్న కమిషనర్ చౌహాన్ స్పష్టం చేశారు. మిల్లర్ల అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
