కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల్సిందే..ఇందిరాపార్క్ వద్ద నిరసన సభలో సీజేపీ డిమాండ్ 

కేంద్ర విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాల్సిందే..ఇందిరాపార్క్ వద్ద నిరసన సభలో సీజేపీ డిమాండ్ 
  • నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి 
  • నిరసనకు సోనమ్ వాంగ్ చుక్, ప్రొ.నాగేశ్వర్, ఆకునూరి మురళి హాజరు 

ముషీరాబాద్, వెలుగు: నీట్ ఎగ్జామ్‌ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేసింది. దేశంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, అక్రమాలకు తావులేకుండా పటిష్టం చేయాలని కోరింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో సీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసన సభ నిర్వహించారు. ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్, ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి, సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియా, వందలాది మంది యువత ఈ నిరసన సభలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోనమ్ వాంగ్ చుక్ మాట్లాడుతూ.. నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్  తర్వాత ఆత్మహత్య చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది చదువు కోసం ఆమె తండ్రి రూ.3 లక్షలు అప్పు చేశారని గుర్తుచేశారు. సీజేపీ రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని మేల్కొల్పడమే దీని లక్ష్యమన్నారు. ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, అక్రమాలకు తావులేకుండా పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.

పర్యావరణ సమస్యలపై గళం విప్పుతున్న హైదరాబాద్ ప్రజలను చూసి గర్వ పడుతున్నానని చెప్పారు. విజేత దహియా మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తికి గౌరవంగా జీవించే హక్కు ఉందన్నారు. విద్యా రంగంలో పటిష్టమైన పునాదులు ఉండాలని, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, దేశ ద్రోహి, పాకిస్తాన్ వాది అంటూ ముద్రలు వేస్తున్నారని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు అన్నారు. ఆకునూరి మురళి మాట్లాడుతూ.. దుర్మార్గపు పరిపాలన చేస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పరీక్షలు కూడా చక్కగా నిర్వహించని వాళ్లు దేశాన్ని పాలిస్తున్నారని విమర్శించారు. 

ఎడ్యుకేషన్ మేనిఫెస్టో తేవాలి.. 

విద్యార్థులు ప్రశ్నించడం నేర్చుకుంటేనే పాలక వర్గాల్లో చలనం వస్తుందని లా విద్యార్థి రుచిత్ ఆశా కమల్, విజయ్ మల్లాంగి, హ్యూమన్ రైట్స్ ఫోరమ్ ప్రతినిధి బిలాల్ సయ్యద్ అన్నారు. సీజేపీ వేసిన మొదటి స్టెప్ ఇదని, ఈ నిరసనలు కేంద్రమంత్రి రాజీనామా చేసేంత వరకు కొనసాగుతున్నాయన్నారు. మరికొంత మంది విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేయడంతోపాటు రిక్రూట్‌మెంట్ బోర్డుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా ఎడ్యుకేషన్ మేనిఫెస్టోను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

కాగా, ‘కాక్రోచ్ ఈజ్ ద న్యూ టైగర్’ అని రాసిన ప్లకార్డులు, తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందించిన సెటైరికల్ బోర్డులు పట్టుకుని యువత ఈ నిరసనలో పాల్గొన్నారు. పుణే, లక్నో, అమృత్‌సర్, బెంగళూరు మీటింగుల అనంతరం ఈ నెల 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.