ఈస్ట్ రూథర్‌ఫోర్డ్: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ తర్వాత స్పెయిన్ విజయోత్సవాల్లో చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణంపై ఫిఫా తీవ్రంగా స్పందించింది. టైటిల్ గెలిచిన స్పెయిన్ ప్లేయర్లతో అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలోనే గొడవకు దిగడంపై క్రమశిక్షణా కమిటీ విచారణను ప్రారంభించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1–0తో అర్జెంటీనాపై గెలిచి చాంపియన్‌గా నిలిచింది. అయితే మ్యాచ్ ముగిసిన వెంటనే రెండు జట్ల ప్లేయర్ల మధ్య గొడవ ప్రారంభమైంది. అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ లియాండ్రో పారెడెస్.. స్పెయిన్ ప్లేయర్ ఎరిక్ గార్సియా మెడ పట్టుకుని నెట్టి వేసినట్లు వీడియో రీప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది.
అడ్డుకోవడానికి వచ్చిన సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ గావిని కూడా కిందకు తోసేశాడు. విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న స్పెయిన్ కెప్టెన్ రోడ్రి కడుపులో అర్జెంటీనా డిఫెండర్ నహుయెల్ మోలినా కొట్టినట్లు ఆధారాలు లభించాయి. అనంతరం మాంచెస్టర్ సిటీ మాజీ సహచరుడు నికోలస్ ఒటమెండి కూడా రోడ్రితో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు.
పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని, ఇతర సభ్యులు మైదానంలోకి పరిగెత్తుకు వచ్చి ఆటగాళ్లను శాంతింపజేశారు. ఈ రచ్చపై ఫిఫా అధికారిక ప్రకటన విడుదల చేసింది. నిబంధనల ఉల్లంఘనపై విచారణ జరిపేందుకు క్రమశిక్షణ, నైతిక విభాగం ప్రాసిక్యూటర్‌ను నియమించినట్లు తెలిపింది. నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
