బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' రెడీ అయింది. ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని అందించేందుకు సెప్టెంబర్ 6న ఆదివారం సాయంత్రం 7 గంటలకు గ్రాండ్ లాంచ్ కానుంది. అయితే ఈ సీజన్ 'దశావతారం' కాన్సెప్ట్ తో సరికొత్తగా అలరించబోతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ షోకు మరోసారి హోస్ట్ గా సందడి చేయనున్నారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి 10 మంది సెలబ్రిటీలతో పాటు 'అగ్నిపరీక్ష 2 ' నుంచి ఎంపికైన 5 లేదా 6 మంది కామనర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
హౌస్ లోకి తొలి కామనర్!
అయితే హౌస్‌లోకి ప్రవేశించే ఆ తొలి కామనర్ ఎవరో క్లారిటీ వచ్చేసింది. రైతు బిడ్డగా, జానపద సింగర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ 'బిగ్ బాస్ 10' అధికారిక కంటెస్టెంట్‌గా 'టికెట్ టు బిగ్ బాస్' సాధించి చరిత్ర సృష్టించింది. అగ్నిపరీక్ష సీజన్ 2 జడ్జెస్ బిందు మాధవి, నవదీప్, అభిజిత్‌లను తన ఆటతీరుతో, జానపద పాటలతో ఝాన్సీ కట్టిపడేసింది. టాస్కుల్లో చూపించిన దూకుడు, వెనకడుగు వేయని నైజం ఆమెను విజేతగా నిలబెట్టాయి. గ్రాండ్ ఫినాలేలో ఝాన్సీకి నేరుగా హౌస్ ఎంట్రీ టికెట్ దక్కించుకుంది.
ఎమోషనల్ మూమెంట్..
ఈ సందర్భంగా నవదీప్ స్టేజ్‌పై భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ బోల్డ్, సరదా, డాషింగ్‌గా కనిపించే నవదీప్ కన్నీళ్లు పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. జడ్జ్ అభిజిత్ స్పందిస్తూ.. 'మీ ఆట బయటకు రావాలనే ఆరోజు రెడ్ కార్డ్ ఇచ్చాను, ఇప్పుడు నిన్ను ఎవరూ ఆపలేరు' అంటూ ఝాన్సీ ప్రశంసించారు.
►ALSO READ | బాక్సాఫీస్ దగ్గర 'టాక్సిక్' ఇంగ్లీష్ వెర్షన్ డిజాస్టర్.. తొలిరోజు కేవలం 450 టికెట్లే సేల్!
ఆట, పాటతో అలరిస్తా..
ఈ'అగ్నిపరీక్ష 2' నుంచి డైరెక్ట్ గా టికెట్ తీసుకొని బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నానంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఝాన్సీ ఎమోషనల్ అయింది. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమే నా అసలైన బలం. జానపద కళ బిగ్ బాస్ హౌస్‌లో గట్టిగా వినిపిస్తుంది. ఇక నా ఆటతో, మన పాటతో మీ అందరినీ అలరిస్తాను అంటూ ఆమె ప్రేక్షకులను సపోర్ట్ కోరింది. కామనర్స్‌కి హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ దొరకడం ఇప్పుడు ఈ 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' పై అంచనాలను ఆకాశాన్ని తాకేలా చేసింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ గ్రాండ్ లాంచ్‌లో ఇంకా ఏ ఏ సర్ ప్రైజ్‌లు ఉన్నాయో చూడాలి.
