
హైదరాబాద్: హైదరాబాద్ సిటీలో వర్ష బీభత్సం వణికించేసింది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు పడిన వర్షం జనాన్ని భయపెట్టింది. మేఘాలు బద్దలయ్యి.. కుండలతో నీళ్లు పోసినట్లు పడిన వానకు హైదరాబాద్ సిటీ షేక్ అయ్యింది. సోమవారం సాయంత్రం 3 గంటల తర్వాత కురిసిన వర్షం.. వర్ష బీభత్సం అంటే ఇదీ అని చూపించింది. 2025, ఆగస్ట్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి పడుతున్న వర్షం దెబ్బకు.. హైదరాబాద్ సిటీ రోడ్లు జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లన్నీ నదులను తలపించాయి. ఆ ఏరియా.. ఈ ఏరియా అని తేడా లేదు. హైదరాబాద్ నగర శివార్లు మొదలుకుని సిటీ మొత్తం వర్షం దంచిపారేసింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి నాన్ స్టాప్గా వర్షం కురుస్తూనే ఉంది. క్లౌడ్ బరస్ట్ అంటే ఇదేనేమో అని నగరవాసులు అభిప్రాయపడ్డారు. ఐటీ కారిడార్లోని ప్రాంతాలు చెరువులను తలపించాయి.
గాలిలో పెరిగిన తేమ శాతం కారణంగా నగరంలో సోమవారం సాయంత్రానికి క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. క్యూమిలో నింబస్ మేఘాల కారణంగా నగరంలో కుండపోత వర్షం కురిసింది. సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకూ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, ఎస్ ఆర్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, సనత్ నగర్ పలు ప్రాంతాల్లో వర్షం పడింది. బషీర్ బాగ్, అబిడ్స్, నాంపల్లి, కోఠి, నారాయణగూడ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది.
ALSO READ |హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం : వారం తర్వాత ఉక్కబోత నుంచి రిలాక్స్
వానొస్తే.. ట్రాఫిక్ జామ్లకు ఐటీ కారిడార్ కేరాఫ్గా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్ రాంగూడ ఐటీ హబ్‌గా ఉండగా ట్రాఫిక్ సమస్య అదే స్థాయిలో ఉంది. అరగంట వాన పడితే చాలు.. మెయిన్ రోడ్లన్నీ చెరువుల్లా మారుతున్నాయి. సోమవారం కూడా ఇదే పరిస్థితి కనిపించింది. శిల్పారామం ఎదురు బస్టాప్, కొత్తగూడ బస్టాప్, మాదాపూర్బాటా షోరూం, నెక్టార్‌గార్డెన్, రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద, బయోడైవర్సిటీ జంక్షన్, ఐఐఐటీ ఎదురుగా, గచ్చిబౌలి ఏఈ ఆఫీస్, రాడిసన్హోటల్, ఐకియా వెనకాల రోడ్డుపై వరదనీరు నిలిచిపోతుండటంతో క్లియర్ అవ్వడానికి గంటల కొద్దీ సమయం పడుతుంది. మూడు, నాలుగు లేన్ల రోడ్డులో కార్లు, బస్సులు, బైకులు ఒకటి, రెండు లేన్లలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.
జేఎన్‌టీయూ నుంచి ఐకియా మీదుగా బయోడైవర్సిటీ రూట్ రెండు వైపులా, షేక్పేట్నుంచి ఖాజాగూడ మీదుగా గచ్చిబౌలి రూట్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి రూట్అంతా ట్రాఫిక్ నిలిచిపోయింది. వాన పడితే లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి మునిగిపోతున్న పరిస్థితి. ఆఫీసుల నుంచి బయల్దేరి సమయానికి వర్షం పడటంతో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.