హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం : వారం తర్వాత ఉక్కబోత నుంచి రిలాక్స్

హైదరాబాద్ సిటీ మొత్తం భారీ వర్షం : వారం తర్వాత ఉక్కబోత నుంచి రిలాక్స్


హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడుతుంది. సిటీ మొత్తం దంచికొడుతుంది. వారం రోజుల గ్యాప్ తర్వాత.. రెండు రోజుల ఉక్కబోత నుంచి సిటీ జనం రిలాక్స్ అయ్యారు. 2025, ఆగస్ట్ 4వ తేదీ సోమవారం మధ్యాహ్నం వరకు ఉక్కబోతతో కూడిన వాతావరణం ఉంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం సిటీని ముంచెత్తింది. 

హైదరాబాద్ సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, నాగోలు, హయత్ నగర్, ఎస్.ఆర్.నగర్, కూకట్ పల్లి, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఏరియాల్లో భారీ వర్షం అల్లకల్లోలం చేసింది. ఉప్పల్, రామంతపూర్, తార్నాక, ఓయూ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాలల్లోనూ వర్షం కుమ్మేసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట ఏరియాల్లో రోడ్లపై నీళ్లు పోటెత్తాయి.

గాలిలో తేమ పెరగటంతో హైదరాబాద్ సిటీ పరిధిలో క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతోనే భారీ వర్షం పడుతున్నట్లు హైదరాబాద్ సిటీ వాతావరణ శాఖ ప్రకటించింది. సాయంత్రం వరకు.. అంటే ఆగస్ట్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వర్షం కొనసాగే అవకాశం ఉందని స్పష్టం చేసింది వాతావరణ శాఖ. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని.. ఒకేసారి ఆఫీసుల నుంచి బయటకు రావొద్దని కూడా సూచిస్తున్నారు అధికారులు.

ALSO READ :తిరుమల కొండపై కుండపోత వర్షం.. మరో నాలుగు రోజులు ఇదే వాతావరణం

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా మిట్టమధ్యాహ్నం కారు చీకట్లు కమ్ముకున్నాయి. ఆకాశం అంతా మబ్బులతో కమ్మేయటమే కాకుండా.. భారీ వర్షంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఖైరతాబాద్ నుంచి కూకట్ పల్లి వరకు, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఏరియాల్లో వాహనాలు నిదానంగా సాగుతున్నాయి. భారీ వర్షంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి. దీంతో వాహనాల వేగం తగ్గింది.

వారం రోజుల నుంచి వర్షాలు తగ్గి.. ఉక్కబోతగా ఫీలవుతున్నారు హైదరాబాద్ సిటీ జనం. ఎండ తీవ్రత లేకపోయినా ఉక్కబోత ఉంది. ఇలాంటి టైంలో సోమవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం పడటంతో.. జనం కూడా రిలాక్స్ అయ్యారు.