V6 News

బీజేపీ విధానాలు లౌకికవాదానికి పెను ప్రమాదం

బీజేపీ విధానాలు లౌకికవాదానికి పెను ప్రమాదం

రాజాసింగ్ లాంటి వ్యక్తులు సమాజానికి ప్రమాదకరమని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మాటలు ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని.. సమాజ శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం అతడిని కట్టడి చేయాలన్నారు. చట్టసభల్లో ఉన్న వ్యక్తిలా రాజాసింగ్ మాట్లాడడం లేదని.. అవసరమైతే ఆయన్ని సమాజం నుంచి బహిష్కరించాలని సూచించారు. రాజాసింగ్ కు ఇది కొత్త కాదని.. గతంలో ఇలా చాలా సార్లు వివాదాస్పద వాఖ్యలు చేశారని చెప్పారు. దళితుల అహారపు అలవాట్లపై కామెంట్స్ చేసి వారిని అవమానించారన్నారు.

బీజేపీ విధానాలు లౌకికవాదాని పెను ప్రమాదంగా మారాయని.. మిడతల దండు దాడి లాగ బీజేపీ నాయకత్వం సమాజంపై దాడి చేస్తుందని భట్టి ఆరోపించారు. కొంతమంది నాయకులు వారి అవసరాల కోసం ప్రజలను రెచ్చగొడుతూ..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని.. భారత రాజ్యాంగం విలువలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏ మతం గురించి ఎవరు కించపరిచేలా మాట్లాడినా.. సభ్య సమాజం ఖండించాలన్నారు.