రాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన

రాహుల్ యాత్రకు అన్ని వర్గాల నుంచి భారీ స్పందన

హైదరాబాద్: బీజేపీ పాలనలో దేశంలో ఆర్ధిక అసమానతలు బాగా పెరిగాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గాంధీ జయంతిని నిర్వహించే నైతిక హక్కు బీజేపీకి లేదని ఆరోపించారు. మహాత్మా గాంధీ వంటి గొప్ప వ్యక్తి భారత్ లో పుట్టడం మనందరి అదృష్టమన్నారు.  దేశంలో రాజకీయ, సామాజిక, ఆర్ధిక అసమానతలు లేకుండా ప్రజలంతా ఒక్కటిగా ఉండాలనే లక్ష్యంతో గాంధీ మహాత్ముడు పని చేశారన్నారు. కానీ ఇవాళ బీజేపీ  కులం, మతం పేరుతో దేశ ప్రజలను విడదీయడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. గాంధీ ఆలోచనా విధానాలకు విరుద్ధంగా బీజేపీ పరిపాలన సాగిస్తోందని చెప్పారు. దేశ సంపదనంతా ఇద్దరు వ్యక్తులకు మాత్రమే కట్టబెడుతూ ప్రజలను నిరుపేదలుగా మారుస్తోందని పైర్ అయ్యారు. ఇకపోతే... కేసీఆర్ ఫ్లైట్ కొనడం ఆయన వ్యక్తిగత విషయమని, ఆయన కొత్త పార్టీ గురించి ఇప్పుడే మాట్లాడలేమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

గాంధీ ఆలోచనా విధానాలతో భారత్ జోడో యాత్ర

గాంధీ మహాత్ముడి ఆలోచనా విధానాలతోనే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను ప్రారంభించారని భట్టి విక్రమార్క తెలిపారు. మోడీ నిరంకుశ పాలనకు చెక్ పెట్టేందుకే రాహుల్ ఈ యాత్రను చేపట్టారని, ఆయన యాత్రకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని చెప్పారు. త్వరలోనే రాహుల్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని, ప్రజలందరూ ఆ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. రాహుల్ నాయకత్వంలో దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. 

అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే అన్ని విధాలా అర్హుడు

మల్లికార్జున ఖర్గే సమర్థవంతమైన నాయకుడని, ఆయన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అన్ని విధాలా అర్హుడని భట్టి స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా, పార్టీ ఫ్లోర్ లీడర్ గా ఖర్గేకు అపారమైన అనుభవముందని, అలాగే గాంధీ కుటుంబానికి ఖర్గే అత్యంత విధేయుడని పేర్కొన్నారు. ఖర్గే ఎన్నికకు దేశంలోని కాంగ్రెస్ నాయకులందరూ సహకరించాలని, శశి థరూర్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకొని ఖర్గేకు మద్దతు పలకాలని కోరారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఖర్గే పేరు తెరమీదకి రావడంతో బీజేపీ నాయకులకు భయం పట్టుకుందని, అందుకే ఆయన్ని ఓ కులానికి పరిమితం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కుట్రలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు.