
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ - 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. గురువారం గచ్చిబౌలి స్టేడియంలో మంత్రి క్రీడా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గతేడాది సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించిన సీఎం కప్- స్ఫూర్తితో ఈసారి కూడా గ్రామ స్థాయి నుంచి పోటీలు నిర్వహించి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.
సీఎం కప్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాలను భాగస్వాములను చేస్తూ ఒక పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘పోటీలను కేవలం హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహం నింపేందుకు ప్రతి జిల్లాలో స్థానికంగా ప్రాచుర్యం పొందిన క్రీడల్లో ఈవెంట్లు నిర్వహించాలి. భవిష్యత్తులో మరింత ప్రోత్సహం అందించేందుకు ప్రతిభావంతులైన క్రీడాకారుల వివరాలతో ఒక సమగ్ర డేటాబేస్‌ను రూపొందించాలి’ అని అధికారులకు సూచించారు.
సీఎం కప్ కింద జారీ చేసే సర్టిఫికెట్లకు విద్య, ఉద్యోగ అవకాశాలలో ప్రత్యేక వెయిటేజీ కల్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి మాట్లాడుతూ, సీఎం కప్‌పై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేసేలా నియోజకవర్గాల్లో టార్చ్ ర్యాలీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.
సీఎం కప్‌ను అత్యుత్తమంగా నిర్వహించే ఐదు జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామని, అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో క్రీడా శాఖ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి, అధికారులు, కోచ్‌లు పాల్గొన్నారు.