
అమరావతి: వైయస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి వైయస్.జగన్‌మోహన రెడ్డి శంకుస్థాపన చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉండి.. వీడియో లింక్ ద్వారా సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. లిఫ్ట్ స్కీమ్ నిర్మించే చోట భారీ నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ తోపాటు.. మంత్రులు పేర్నినాని, కొడాలినాని, ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, జగన్ మోహన్‌రావు, కైలే అనిల్‌కుమార్, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ. రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు అతి సమీపంలోని కృష్ణా జిల్లాలోని నందిగామ, వత్సవాయి, పెనుగంచి ప్రోలు, జగ్గయ్యపేట ప్రాంతాల్లో సాగునీటికే కాదు.. తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఉందన్నారు. 5 ఏళ్లపాటు అధికారంలో ఉండికూడా, ఈ ప్రాజెక్టు చేస్తే మంచి జరుగుతుందని తెలిసినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే, 14 నెలల్లోపు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాన చేశాం.. ఫిబ్రవరి 2021 నాటికల్లా ఈప్రాజెక్టును పూర్తిచేయాలని దృఢసంకల్పంతో.. లక్ష్యంగా పెట్టుకున్నాం.. నాగార్జున సాగర్ ఎడమ కాల్వనుంచి ఈప్రాంతానికి అందాల్సిన నీరు అందడంలేదు.. దీనికి పరిష్కారంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. ఈ ప్రాంతంలోని 38,627 ఎకరాలకు నీరు అందిస్తామని.. డీబీఆర్ బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 30 గ్రామాలకు, వాటితోపాటు జగ్గయ్యపేట మున్సిపాలిటీకి కూడా వైయస్సార్ వేదాద్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా నీరు అందిస్తామని.. మొత్తంగా చూస్తే దాదాపు 2.7 టీఎంసీల నీటిని ఈ ప్రాంతానికి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సుమారు 490 కోట్లు ఖర్చు చేస్తున్నాం.. ఈ ప్రాజెక్టు ద్వారా నీటి సమస్యలు తీరిపోవాలి..ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుకుంటూ.. నాకు ఈ అవకాశం కల్పించిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. పెళ్లిరోజున ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.
రైతు బాంధవుడిగా నిలిచారు: మంత్రులు, ఎమ్మెల్యేలు
వేదాద్రి ప్రాజెక్టు నిర్మాణానికి సంకల్పించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ రైతు బాంధవుడిగా నిలిచారని శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యమంత్రిగారు పెళ్లిరోజు కానుకగా.. రైతులకోసం ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దంపతులు నూరు వసంతాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు ఇప్పుడు నిజంకాబోతున్నాయి.. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో ఈ ప్రాంతానికి మేలు చేశారని, మళ్లీ 15 ఏళ్లతర్వాత ఇప్పుడు మళ్లీ ఈ ప్రాంతానికి మేలు చేస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎకరాకు రూ.10 లక్షల రూపాయల విలువ పెరిగిందని, రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం వచ్చిన వేళా విశేషం కారణంగా.. మంచిగా వర్షాలు పడ్డాయని, నీళ్లు అందుతున్నాయన్నారు.