పంటల తెలంగాణ కావాల్నా..మంటల తెలంగాణ కావాల్నా? 

పంటల తెలంగాణ కావాల్నా..మంటల తెలంగాణ కావాల్నా? 
  •     బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తోంది మత పిచ్చిగాళ్లను తరిమికొట్టాలి 
  •     పంటల తెలంగాణ కావాల్నా..మంటల తెలంగాణ కావాల్నా? 
  •     ఢిల్లీలోని కేజ్రీవాల్ సర్కార్​ను కూడా కూల్చాలని చూస్తున్నరు  
  •     కొంగరకలాన్ లో రంగారెడ్డి కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం 
  •     జిల్లా ఎమ్మెల్యేలకు అదనంగా రూ.10 కోట్ల నిధులిస్తామని ప్రకటన 

సిలికాన్‌‌ వ్యాలీ ఆఫ్‌‌ ఇండియా అయిన బెంగళూరు ఉద్యోగాల కల్పనలో ముందుం డేది. ఇప్పుడు హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. కర్నాటకలో హలాల్‌‌, హిజాబ్‌‌ అంటూ రకరకాల మత పిచ్చి లేపి భయంకరమైన వాతావరణాన్ని కల్పించా రు. ఇప్పుడు ఉద్యోగాల కల్పనలో హైదరా బాద్‌‌ కన్నా వెనుకబడిపోయింది. మనం అలాంటి పరిస్థితి తెచ్చుకుందామా? బంగా రు పంటల తెలంగాణ కావాల్నా.. మంటల తెలంగాణ కావాల్నా?   ‑ సీఎం కేసీఆర్

హైదరాబాద్‌‌/ఎల్బీ నగర్, వెలుగు: పోరాటం చేసి తెలంగాణ తెచ్చానని, తాను బతికుండగా రాష్ట్రాన్ని ఆగం కానియ్యనని సీఎం కేసీఆర్ అన్నారు. చిల్లర రాజకీయాల కోసం బీజేపీ దేశాన్ని నాశనం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఓట్ల కోసం దేశంలో గందరగోళం సృష్టిస్తోందని ఫైర్ అయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌‌లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌‌ కలెక్టరేట్‌‌ కాంప్లెక్స్‌‌ను గురువారం సీఎం ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మత పిచ్చిగాళ్లకు, ప్రజల మధ్య చీలిక తెచ్చేవాళ్లకు దేశంలో స్థానం లేదని నిరూపించాలి. ఈ ప్రభుత్వాన్ని కేంద్రం నుంచి పారదోలితేనే మనం బాగుపడతాం. ఈ రక్త పిశాచాలను, మత పిచ్చిగాళ్లను సాగనంపాలి” అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్న సంక్షేమ పథకాలు ఎక్కడా లేవని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

‘‘దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాం. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మనం నిద్రపోయి ఉంటే ఆగమైతం. మంటలు పెట్టె మత పిచ్చి రాజకీయాలు మనకొద్దు. దీనిపై గ్రామాగ్రామాన చర్చించాల్సిన అవసరం ఉంది” అని అన్నారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేధావులు, బుద్ధిజీవులు ముందుండాలని సూచించారు. ‘‘ప్రజలంతా ప్రేమ, అభిమానంతో ఉంటేనే.. ఆ సమాజం బాగుపడుతుంది. అసహనం, కర్ఫ్యూలు, బంద్ లు ఉంటే ఆగమవుతం. శాంతియుత తెలంగాణను తెర్లు కాకుండా కాపాడుకోవాలి” అని పిలుపునిచ్చారు. ఎన్నో ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చుకొని బాగు చేసుకున్నామని.. గతంలో ఏమరపాటుగా ఉంటేనే 58 ఏండ్లు గోసపడ్డామని, ఇప్పుడు మళ్లా అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతున్నరు.. 

నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని, దేశంలో అంతకన్నా పెద్ద పదవి ఇంకేముంటుందని కేసీఆర్ ప్రశ్నించారు. అయినా ఇంకా ఏమో కావాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆగం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్‌‌ సహా తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేస్తామని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీలోనూ అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఇచ్చి కొంటామని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక రాజకీయ అరాచకత్వమా? సమాధానం చెప్పాలి” అని ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రే గొప్పోడైతే దేశమంతా 24 గంటల కరెంట్‌‌ ఎందుకు ఇవ్వడం లేదు? నదుల నీళ్లన్నీ సముద్రంలోకి వృథాగా పోతుంటే దేశమంతా ఎందుకు మంచినీళ్లు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం దేశంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు అయినా నిర్మించిందా? ఇంకేదైనా మంచి పని చేసిందా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఇల్లు గానీ, ప్రాజెక్టుగానీ కట్టాలంటే చాలా టైం పడుతుందని.. కూలగొట్టడానికి రెండు, మూడు రోజులు చాలని అన్నారు. కృష్ణా జలాల్లో మన వాటా తేల్చాలంటే, కేంద్రం తేల్చడం లేదని.. దానికి ఎనిమిదేండ్లు కూడా చాలదా? అని ప్రశ్నించారు. 

ఢిల్లీలో జెండా ఎత్తుత.. 

దేశంలో రైతు సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని కేసీఆర్ అన్నారు. ‘‘రైతులు పండించిన పంటను కొంటున్నం. ధాన్యం కొన్న వారం లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా, వారంలో వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.5 లక్షలు బీమా జమ చేస్తున్నాం. ఢిల్లీలోనే కరెంట్‌‌ ఉండదు.  తాగేందుకు మంచి నీళ్లు దొరకవు. కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్‌‌, మిషన్‌‌ భగీరథ నీళ్లు అందిస్తున్నాం. రెచ్చగొట్టేటోళ్ల మాటలు నమ్మి ఇవన్నీ బంద్‌‌ చేసుకుందామా?’’ అని ప్రశ్నించారు. ‘‘మీ అందరి సహకారంతో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. మీ ఆశీర్వాదం ఉంటే ఢిల్లీలో జెండా ఎత్తుతా. నన్ను దీవించండి” అని కోరారు.