బడ్జెట్​ సమావేశాలు.. గవర్నర్‌‌ స్పీచ్ లేకుండానే

బడ్జెట్​ సమావేశాలు.. గవర్నర్‌‌ స్పీచ్ లేకుండానే
  • బడ్జెట్​ సమావేశాలు.. గవర్నర్‌‌ స్పీచ్ లేకుండానే
  • కేంద్రంపై అసంతృప్తితోనే గవర్నర్​ను దూరం పెట్టినట్టు ప్రచారం
  • పాత సెషన్​ ప్రొరోగ్​ కానందుకేనంటున్న ప్రభుత్వం

హైదరాబాద్​, వెలుగు: గవర్నర్​ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు సీఎం కేసీఆర్​ నిర్ణయం తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్​ ప్రసంగంతో బడ్జెట్​ సమావేశాలు మొదలు కావటం ఆనవాయితీ. ఆ తర్వాత రోజు గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం చేసి, మరుసటిరోజు బడ్జెట్​ ప్రవేశపెడ్తుంటారు. ఏండ్లకేండ్లుగా ఉన్న ఈ ఆనవాయితీ, సంప్రదాయాలకు భిన్నంగా ఈసారి బడ్జెట్​ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తితోనే గవర్నర్​ స్పీచ్​ లేకుండా బడ్జెట్​ సమావేశాలు మొదలుపెట్టాలని సీఎం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతున్నది. 

ఇట్లా జరుగుతుండె..!

అసెంబ్లీ బిజినెస్​ రూల్స్​ ప్రకారం ప్రతి ఏడాది తొలి సెషన్​ ఉభయ సభల జాయింట్​ మీటింగ్​లో గవర్నర్​ ప్రసంగంతో మొదలు పెట్టాలనే నియమావళి ఉంది.  కానీ.. గత సెప్టెంబర్​లో జరిగిన అసెంబ్లీ, కౌన్సిల్​ సమావేశాలు ఇప్పటికీ ప్రొరోగ్​ కాలేదు. దీంతో అదే సెషన్​ ఇప్పటికీ కొనసాగుతున్నట్లు భావించాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.  అందుకే జాయింట్​ మీటింగ్​, గవర్నర్​ ప్రసంగం అవసరం లేదని చెప్తున్నాయి.  సెప్టెంబర్​లో మొదలైన సెషన్​కు సంబంధించి.. రెండో మీటింగ్​గా బడ్జెట్​ సమావేశాలు ప్రారంభమవుతాయని నోటిఫికేషన్​లో ప్రస్తావించారు. పూర్వపు సమావేశం ప్రొరోగ్ కాని సందర్భంలో తర్వాత వచ్చే సెషన్ ను స్పీకర్​ ప్రారంభిస్తారు. అందుకే ఈసారి బడ్జెట్​ సమావేశాలు స్పీకర్ అధ్యక్షతన మొదలవుతాయని అధికారులు చెప్తున్నారు.  

హుజూరాబాద్​ ఉప ఎన్నికకు ముందు పాడి కౌశిక్​రెడ్డిని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ క్యాండిడేట్​గా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్  చేసింది. కేబినెట్​ పంపిన ఈ ప్రతిపాదనను గవర్నర్‌ పక్కన పెట్టారు. సోషల్‌ సర్వీస్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేయడంతో.. ఆయన ఏయే రంగాల్లో సేవ చేశారంటూ రాజ్‌భవన్‌ వివరణ కోరింది. కౌశిక్‌పై ఉన్న కేసుల వివరాలపైనా ఆరా తీసి.. కేబినెట్‌ ప్రతిపాదనను వెనక్కి పంపించింది. కౌశిక్​ స్థానంలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారిని ఎమ్మెల్సీగా నామినేట్‌ చేస్తూ కేబినెట్​ మళ్లీ ఫైలు పంపటంతో గవర్నర్​ తమిళిసై ఆమోదం తెలిపారు. కౌశిక్​రెడ్డి విషయంలో తన నిర్ణయానికి ఎదురుదెబ్బ తగలటంతో.. కేసీఆర్ ​రాజ్​భవన్​కు దూర దూరంగానే ఉంటున్నారు.  

ఈ ఏడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్​ డే వేడుకలను  పబ్లిక్‌ గార్డెన్స్‌లో కాకుండా రాజ్‌భవన్‌ ఆవరణలోనే నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్‌ తీర్మానం చేసింది. కానీ, రాజ్‌భవన్‌లో జరిగిన ఈ ఉత్సవాలకు సీఎం, మినిస్టర్లు అందరూ దూరంగా ఉన్నారు.  దీంతో  సీఎస్‌, డీజీపీ, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గవర్నర్‌ను రిసీవ్‌ చేసుకున్నారు. శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ నియామకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం తీరును గవర్నర్​ ప్రశ్నించారు.  ప్రొటెం చైర్మన్​గా ఉన్న భూపాలరెడ్డి పదవీకాలం ముగిసిన తర్వాత ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీని ప్రొటెం చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. వరుసగా రెండోసారి ప్రొటెం చైర్మన్‌ను ఎందుకు నియమించాల్సి వస్తోందని  రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ వివరణ కోరినట్లు తెలిసింది. చివరకు మండలి చైర్మన్‌ పోస్టు ఖాళీగా ఉండకూడదని ఈ ప్రపోజల్​ను ఆమోదించారు.


ఇటీవల మేడారం జాతర చివరి రోజు గవర్నర్‌ వన దేవతల దర్శనానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్​ టూర్​కు సంబంధించి రాజ్‌భవన్‌ నుంచి ప్రభుత్వానికి ముందస్తు  సమాచారం అందించారు.  గవర్నర్‌ పర్యటనకు ఒకరోజు ముందే సీఎం కేసీఆర్​ మేడారం వెళ్లాల్సి ఉన్నా..రద్దు చేసుకున్నారు. గవర్నర్‌  మేడారం వెళ్లడానికి హెలిక్యాప్టర్‌ సమకూర్చాలని రాజ్‌భవన్‌ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా, ప్రభుత్వం అంగీకారం తెలుపలేదు. ఒక్కటే హెలిక్యాప్టర్‌ అందుబాటులో ఉందని, సీఎం షెడ్యూల్‌ ఉండటంతో గవర్నర్‌కు హెలిక్యాప్టర్‌ సమకూర్చడం సాధ్యం కాదని సమాధానమిచ్చారు. దీంతో గవర్నర్‌ రోడ్డు మార్గంలో మేడారానికి వెళ్లారు. అప్పటివరకు అక్కడ ఉన్న మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు కలెక్టర్‌, ఎస్పీ.. గవర్నర్​వచ్చే టైమ్​కు అందుబాటులో లేకుండా పోయారు.

7న రాష్ట్ర బడ్జెట్
మార్చి 7న అసెంబ్లీ బడ్జెట్​ సమావేశాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్​కు ఆమోదం తెలిపేందుకు 6న సాయంత్రం రాష్ట్ర కేబినెట్​ ప్రగతి భవన్​లో భేటీ అవుతుందని సోమవారం సీఎంవో  ప్రకటన విడుదల చేసింది. మార్చి 7న ఉదయం 11.30 గంటలకు అటు అసెంబ్లీలో.. ఇటు కౌన్సిల్​లో వేర్వేరుగా బడ్జెట్​ ప్రవేశపెట్టనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహచార్యులు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ చేశారు.