కేసీఆర్​ కేబినెట్​ విస్తరణ నేడు

కేసీఆర్​ కేబినెట్​ విస్తరణ నేడు
  • సాయంత్రం 4 గంటలకు ప్రమాణం
  • ఆరుగురు లేదా నలుగురికి చాన్స్​
  • కేటీఆర్, హరీశ్, సబితా ఇంద్రారెడ్డికి దాదాపు ఖాయం!
  • ప్రచారంలో సత్యవతి, పువ్వాడ అజయ్, గంగుల పేర్లు
  • రాజ్​భవన్​లో మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్ర కేబినెట్​ను విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ నిర్ణయించారు. ముహూర్తం కూడా ఖరారు చేశారు. దశమి కావడంతో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించాలని సీఎం నిర్ణయించినట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర కొత్త గవర్నర్​గా తమిళిసై సౌందరరాజన్​ఉదయం 11 గంటలకు ప్రమాణం చేయనుండగా.. సాయంత్రం కొత్త మంత్రులతో ఆమె ప్రమాణం చేయిస్తారు. మంత్రుల ప్రమాణానికి రాజ్​భవన్​లో ఏర్పాట్లు చేయాలని సీఎస్​ ఎస్​కే జోషిని శనివారం రాత్రి సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కొత్త గవర్నర్​ తమిళిసైకి అందజేశారు.

ఎవరికి దక్కేనో?

కేబినెట్​లోకి కొత్తగా ఆరుగురిని లేదా నలుగురిని తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సీఎంతో కలిపి రాష్ట్ర కేబినెట్​లో 18 మందికి అవకాశం ఉండగా.. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది ఉన్నారు. ఆరు బెర్త్​లు ఖాళీగా ఉన్నాయి.

టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్​రావు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి పక్కగా మంత్రి పదవులు దక్కుతాయని ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్​, హరీశ్​రావు మంత్రులుగా పనిచేశారు. మళ్లీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేటీఆర్​ను టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా కేసీఆర్​ నియమించారు.  మహేశ్వరం నుంచి కాంగ్రెస్​ టికెట్​పై గెలిచి టీఆర్​ఎస్​లో చేరిన సబితా ఇంద్రారెడ్డి.. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఆదిలాబాద్​ ఎమ్మెల్యే జోగు రామన్న, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్​కి కూడా మంత్రి పదవులు దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది. జోగు రామన్న కూడా గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మరోవైపు సత్యవతి రాథోడ్​ పేరు మండలి చైర్​పర్సన్​ రేసులోనూ  ఉంది.  వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​తోపాటు సత్తుపల్లి నుంచి టీడీపీ టికెట్​పై ఎమ్మెల్యేగా గెలిచిన సండ్ర వెంకట వీరయ్య పేర్లు కేబినెట్​ రేస్​లో వినిపిస్తున్నాయి.  గత ఏడాది డిసెంబర్​ 11న అసెంబ్లీ ఫలితాలు వచ్చాక.. అదే నెల 13న సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి మహమూద్‌ అలీ ప్రమాణం చేశారు.  ఫిబ్రవరి 19న చేపట్టిన విస్తరణలో కొత్తగా పది మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. అప్పటి నుంచి కేబినెట్‌ విస్తరణపై ఊహాగానాలు సాగుతున్నాయి. ఒకానొక దశలో నవంబర్‌ వరకు కేబినెట్‌ విస్తరణ ఉండకపోవచ్చని ప్రచారం జరిగింది. సోమవారం నుంచి రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్​ కేబినెట్​ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు.

బడ్జెట్ ​సమావేశాలకు ముందు వరుస నిర్ణయాలు

సోమవారం నుంచి రాష్ట్ర బడ్జెట్​ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్​ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. శనివారం మండలి, అసెంబ్లీ చీఫ్​ విప్​లను, విప్​లను నియమించారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేబినెట్​ను విస్తరించనున్నారు. త్వరలోనే కార్పొరేషన్​ చైర్మన్​ పదవులతోపాటు ఇతర పదవులను కూడా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 12 మంది ఎమ్మెల్యేలకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇవ్వాలనే యోచనలో సీఎం ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన సీనియర్‌ నేతలు మధుసూదనాచారి, జూపల్లి కృష్ణారావుకు త్వరలోనే ఉన్నత పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న మాజీ మంత్రులు కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డితోపాటు మాజీ డిప్యూటీ స్పీకర్‌, ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌,  మరికొందరికి పదవులు ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టుగా సీఎంవో వర్గాల సమాచారం. వీరిలో కొందరికి రాజ్యసభ సీటు, మరికొందరికి ఆర్టీసీ, రైతు సమన్వయ సమితి చైర్మన్‌ లాంటి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.

మండలి చైర్మన్​గా గుత్తా?

గుత్తా సుఖేందర్‌రెడ్డికి మండలి చైర్మన్‌ పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్​ పేరు కూడా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ మంత్రి పదవి ఆశిస్తుండగా.. ఒకరిని కేబినెట్​లోకి తీసుకొని, మరొకరికి మండలి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇద్దరిపై వేటు?

ఇద్దరు మంత్రులను తప్పించే అవకాశం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మంత్రి ఈటల రాజేందర్​ విషయంలోనూ ఇదే ప్రచారం జరిగింది. ఆయనపై కొన్ని కథనాలు రావడంతో పాటు ఆయనను తప్పిస్తారంటూ జోరుగా ఊహాగానాలు నడిచాయి. అయితే.. ఆ తర్వాత పరిణామాల్లో ఈటల పదవికి ఎలాంటి ఇబ్బంది లేదంటూ మంత్రి ఎర్రబెల్లి తేల్చిచెప్పారు. ప్రస్తుతం కేబినెట్​ను విస్తరిస్తున్న నేపథ్యంలో  ఇద్దరు మంత్రులపై వేటు వేసే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏ మంత్రిపై వేటు పడనుందన్నది ఆసక్తికి దారితీసింది.

నేడు కేబినెట్‌ భేటీ

రాష్ట్ర కేబినెట్​ ఆదివారం రాత్రి 7 గంటలకు సమావేశం కానుంది. ప్రగతి భవన్‌లో  ఈ భేటీని ఏర్పాటు చేశారు. కొత్త మంత్రులు కూడా కేబినెట్‌ సమావేశంలో పాల్గొనున్నారు.  రాష్ట్ర బడ్జెట్‌కు కేబినెట్​ ఆమోదం తెలుపనుంది.

CM KCR has decided to expand the state cabinet Today