రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇండ్లకు జెండాలు

రాష్ట్రంలో కోటి 20 లక్షల ఇండ్లకు జెండాలు
  • అన్ని లోకల్ బాడీల్లోనూ సమావేశాలు 
  • కోటీ 20 లక్షల ఇండ్లకు ఫ్రీగా జాతీయ జెండాల పంపిణీ 

హైదరాబాద్, వెలుగు: 75 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని లోకల్ బాడీల్లోనూ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించనున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాలపై మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఉత్సవాల కమిటీ చైర్మన్ కె.కేశవరావు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరిలో దేశభక్తి భావన, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి రగిలేలా వైభవంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. విద్యార్థులు,  ఉద్యోగులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, యావత్ తెలంగాణ సమాజం ఉత్సవాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కోటీ 20 లక్షల ఇండ్లకు జాతీయ జెండాలను ఉచితంగా ఈ నెల 9 నుంచే పంపిణీ చేయాలని ఆదేశించారు. 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కృషి చేయాలని సూచించారు. 

2 వేల మందితో ప్రారంభోత్సవం..

ఈ నెల 8న వజ్రోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ లో ఘనంగా నిర్వహించాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 2 వేల మందితో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు.

15 రోజులు వేడుకలు.. 

ఈ నెల 8న హెచ్ఐసీసీలో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. 9న జాతీయ జెండాల పంపిణీ ప్రారంభం, 10న ప్రతి ఊరిలో మొక్కలు నాటడం, ఫ్రీడం పార్కుల ఏర్పాటు, 11న  ఫ్రీడం రన్, 12న వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాల కోసం మీడియాకు విజ్ఞప్తి, 13న వజ్రోత్సవ ర్యాలీలు, 14న నియోజకవర్గ కేంద్రాల్లో సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో కార్యక్రమాలు, టపాకులు కాల్చడం, 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, 16న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన,  కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ, 17న రక్తదాన శిబిరాల నిర్వహణ, 18న ఫ్రీడం కప్ పేరుతో ఆటల పోటీలు, 19న దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు, జైళ్లలో ఖైదీలకు పండ్లు, స్వీట్ల పంపిణీ, 20న దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ముగ్గుల పోటీలు, 21న అసెంబ్లీ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం, 22న ఎల్బీస్టేడియంలో ముగింపు వేడుకలు.