సెక్రటేరియెట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

సెక్రటేరియెట్ నిర్మాణ పనులు పరిశీలించిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ : కొత్త సెక్రటేరియెట్ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల పనులు సమాంతరంగా జరిపిస్తూ త్వరితగతిన సెక్రటేరియట్ నిర్మానాన్ని పూర్తి చేయాలని సూచించారు. మంగళవారం నూతన సచివాలయ ప్రాంగణానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రుల ఛాంబర్లు, కాన్ఫరెన్స్ హాళ్లు, ఉద్యోగులు, సిబ్బంది కార్యాలయాలను కలియదిరిగి చూశారు. వెంటిలేషన్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 

రాజస్థాన్ నుంచి తెప్పించిన రెడ్ స్టోన్తో నిర్మిస్తున్న వాల్స్ను పరిశీలించిన సీఎం కేసీఆర్ వాటిని ప్రత్యేక డిజైన్లతో తీర్చిదిద్దాలని అధికారులను సూచించారు. కొన్ని పిల్లర్ల డిజైన్లకు మార్పులు సూచించారు. సెక్రటేరియెట్ బిల్డింగ్ పరిసరాల్లో ఓపెన్ గ్రౌండ్ ఫిల్లింగ్ పనులు సమాంతరంగా జరిపించాలని, లాన్, ఫౌంటేన్ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని సీఎం ఆదేశించారు. సెక్రటేరియెట్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి, అధికారులను అభినందించారు.