764 జీఓ పేరుతో కేసీఆర్ ​కొత్త నాటకం.. పి.సాయిబాబా ఆరోపణ

764 జీఓ పేరుతో కేసీఆర్ ​కొత్త నాటకం.. పి.సాయిబాబా ఆరోపణ

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలను మరోసారి మోసం చేసేందుకు 764 జీఓ పేరుతో సీఎం కేసీఆర్ కొత్త నాటకానికి తెరలేపుతున్నారని టీడీపీ సిటీ అధ్యక్షుడు పి.సాయిబాబా ఆరోపించారు. బీసీలకు స్వయం ఉపాధి కింద రూ.లక్ష ఇస్తామంటూ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. బుధవారం దోమలగూడలోని టీడీపీ ఆఫీస్​లో సాయిబాబా మీడియాతో మాట్లాడారు. ఉన్నట్టుండి కేసీఆర్ కు బీసీలు గుర్తుకురావడం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కులవృత్తులను కూలిపోయేలా చేసింది కేసీఆరేనని మండిపడ్డారు.12 రకాల ఫెడరేషన్లు పెట్టారే తప్ప నియామకాలు చేపట్టలేదని, నిధులు ఇవ్వలేదని చెప్పారు. బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే బీసీ బంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల కిశోర్, బాలరాజుగౌడ్, రవీంద్రచారి, ప్రశాంత్ యాదవ్, సత్యనారాయణ, రవి గౌడ్, అనిల్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.