మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రులు, ఇన్‌చార్జీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

మునుగోడు ఉప ఎన్నికలపై మంత్రులు, ఇన్‌చార్జీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం
  • బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి
  • నెలాఖరులో ప్రచారానికి మునుగోడు వస్తానని వెల్లడి
  • ఎనిమిది రోజుల తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సీఎం

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మునుగోడు ఉప ఎన్నికలో తామే గెలుస్తున్నామని, ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఎన్నికల ప్రచార ఇన్‌‌‌‌చార్జీలుగా ఉన్న మంత్రులు, ఇతర లీడర్లకు  సూచించారు. బుధవారం రాత్రి ప్రగతి భవన్‌‌‌‌ నుంచి ఉప ఎన్నిక ఇన్‌‌‌‌చార్జీలతో కేసీఆర్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది, సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎక్కడ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు గట్టి పోటీ ఉంది, ఎక్కడెక్కడ మెరుగుపడాలన్న అంశాలపై పలు సూచనలు చేశారు. మీడియా, సోషల్‌‌‌‌ మీడియాలో బీజేపీ హడావుడి చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వంపై, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పై తనతో పాటు ఇతర లీడర్లపైనా తప్పుడు ప్రచారం చేస్తోందని, దాన్ని తిప్పికొట్టాలన్నారు. బీజేపీ తీరును ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఎలక్షన్‌‌‌‌ కమిషన్‌‌‌‌ గతంలో తొలగించిన గుర్తులను ఇప్పుడు కేటాయించి టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ గెలుపును అడ్డుకోవాలని కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ఈనెలాఖరులో తాను ప్రచారానికి వస్తానని, హరీశ్‌‌‌‌ ఇప్పటికే ఫీల్డ్‌‌‌‌లో ఉన్నారని.. కేటీఆర్‌‌‌‌ సైతం ప్రచారానికి వస్తారని తెలిపారు. చండూరులో లక్ష మందితో ఈ నెల 30న తన సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎలక్షన్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జీలుగా ఉన్న లీడర్లు అవసరమైతే తప్ప తమకు కేటాయించిన గ్రామాల నుంచి బయటికి రాకూడదన్నారు.

8 రోజుల తర్వాత హైదరాబాద్‌‌‌‌కు
ఎనిమిది రోజుల ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం కేసీఆర్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వచ్చారు. ఈ నెల 11న యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌‌‌‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కేసీఆర్‌‌‌‌ యూపీలోని ఇటావా జిల్లా సైఫై గ్రామానికి వెళ్లారు. ములాయం భౌతికకాయానికి నివాళులర్పించాక ఢిల్లీ వెళ్లారు. అదే రోజు రాత్రి ఢిల్లీలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ కోసం అద్దె భవనాన్ని పరిశీలించారు. బిల్డింగ్‌‌లో చేపట్టాల్సిన మార్పులపై సూచనలు చేశారు. తర్వాతి రోజు ఢిల్లీలోని వసంత్‌‌‌‌ విహార్‌‌‌‌లో నిర్మిస్తున్న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌  ఆఫీస్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ పనులను పరిశీలించారు. మరుసటి రోజు నుంచి తుగ్లక్‌‌‌‌ రోడ్డులోని తన ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం సీఎస్‌‌‌‌, అధికారులను ఢిల్లీకి పిలిపించి పలు అంశాలపై రివ్యూ చేశారు. మంగళవారం ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మునుగోడు ఉప ఎన్నికపై అధికారులు, మంత్రులతో వేర్వేరుగా ఫోన్‌‌‌‌లో రివ్యూ చేశారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి 3.20కు హైదరాబాద్‌‌‌‌కు తిరిగి వచ్చేశారు.

సీఎస్‌‌‌‌, డీజీపీతో సమీక్ష
ప్రగతి భవన్‌‌‌‌లో బుధవారం సాయంత్రం సీఎస్‌‌‌‌ సోమేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌, డీజీపీ మహేందర్‌‌‌‌ రెడ్డి, ఫైనాన్స్‌‌‌‌ సెక్రటరీ రామకృష్ణారావు సహా పలువురు అధికారులతో సీఎం కేసీఆర్‌‌‌‌ సమీక్ష నిర్వహించారు. అక్టోబర్‌‌‌‌ లో వచ్చిన ఆదాయం, ఇప్పటి వరకు చేసిన వ్యయం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక శాఖ నేరుగా తీసుకునే అప్పులు, కార్పొరేషన్‌‌‌‌ల ద్వారా సేకరించే లోన్‌‌‌‌లు, రాష్ట్రంలో శాంతిభద్రతలు తదితర అంశాలపై వారితో సమీక్షించినట్లు తెలిసింది.