
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యేలు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎల్పీ జాయింట్ మీటింగ్‌లో ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఎమ్మెల్యేల్లో స్తబ్దత ఎక్కువ ఉంది. అన్నీ కేసీఆరే చూసుకుంటారు.. ఓన్లీ ఫేస్ ఆఫ్ కేసీఆర్ అనే భావన సరికాదు. ఎమ్మెల్యేలు ఎవరు ఏం చేస్తున్నరో నా వద్ద పూర్తి చిట్టా ఉంది. నాకు ఏమీ తెలియదు అనుకోవద్దు. ఒకానొక దశలో ఇందిరాగాంధీ తనను మించిన సూపర్ పవర్ దేశంలోనే లేదని అనుకున్నరు. చివరికి కాంగ్రెస్ పార్టీలో లేకుండా పోయి.. ఆమె కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది” అని అన్నారు. నియోజకవర్గంలోని నేతలందరినీ కలుపుకొని ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. నియోజకవర్గంలో కుల వృత్తులు చేసుకునే వారందరితో కలిసి ఎమ్మెల్యేలు సహపంక్తి భోజనాలు చేయాలన్నారు. మత చాందసవాదులు రాష్ట్రంలో విస్తరించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారని, వారికి అలాంటి అవకాశం ఇవ్వకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడాలని, వాళ్లను దేశం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చిందని, ఈ పరిస్థితుల్లో వారికి రాష్ట్రంలో చోటే ఇవ్వొద్దని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో విభజన రాజకీయాలు ప్రోత్సహిస్తున్నదని, అయితే రామమందిరం.. లేదంటే కశ్మీర్ ఫైల్స్.. పుల్వామా.. పాకిస్తాన్ పేరు చెప్పి ఓట్లు కొళ్లగొట్టాలని చూస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంపైనా కేంద్ర ప్రభుత్వం అంతులేని వివక్ష చూపుతున్నదన్నారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లలో కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజోపయోగ పథకాలు, ప్రాజెక్టులపై ప్రచారం చేయాలన్నారు. సిద్దిపేటలో తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు డబ్బులు, లిక్కర్ అవసరమే లేకుండెనని, ఇప్పుడు డబ్బులు లేకుండా రాజకీయాలు ఊహించలేని పరిస్థితి వచ్చిందని కేసీఆర్ అన్నారు.
కేంద్రం తీరుపై నిరసనలు చేపట్టాలి
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ నెల 24న అన్ని నియోజకవర్గాల్లో ఇన్‌చార్జులతో సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. రాష్ట్రంలో పండిన వడ్లన్నీ కేంద్రమే కొనాలని కోరుతూ 26న గ్రామ పంచాయతీ, 27న మండల పరిషత్, 30న జిల్లా పరిషత్‌లలో తీర్మానాలు చేయాలన్నారు. ఒక్కో రైతు ఇంటి నుంచి పిడికెడు వడ్లు తెచ్చి ఏప్రిల్ 2 నుంచి అన్ని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని, దిష్టిబొమ్మలు దహనం చేయాలని చెప్పారు. బియ్యం కాకుండా ధాన్యమే కేంద్రం కొనాలనే విషయంపై రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు, రాష్ట్రంలో పండిన వడ్లను కొనాలని కోరుతూ నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. దశల వారీగా ఆందోళనల తీవ్రత పెంచాలని సూచించారు. 28న యాదాద్రి ఆలయానికి ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలంతా రావాలని సీఎం ఆహ్వానించారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు సీఎం క్లాస్!
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు సీఎం కేసీఆర్ క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం అనంతరం తెలంగాణ భవన్‌లోని తన చాంబర్‌కు ఎమ్మెల్యేను పిలిపించుకొని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. హోలీ పండుగ రోజు బహిరంగంగా మందు పోసి డ్యాన్స్‌లు చేయడం ఏందని సీరియస్ అయ్యారు. ‘‘హోలీ నీవు ఒక్కడివే చేసుకుంటున్నవా.. దేశమంతా పండుగ చేసుకున్నరు.. పార్టీ పరువు తీస్తే బయటకు విసిరేస్త’’ అని కటువుగానే హెచ్చరించినట్టు తెలిసింది. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఎన్ని కంప్లయింట్లు వచ్చినా క్షమించానని, బహిరంగంగా మందు పోసి డ్యాన్స్‌లు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఇంకోసారి ఇట్లా చేస్తే పార్టీ నుంచి బహిష్కరిస్తానని కేసీఆర్ తేల్చిచెప్పినట్లు సమాచారం.
నేడు ఢిల్లీకి మంత్రులు
రాష్ట్రంలో పండిన యాసంగి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలని కోరడానికి రాష్ట్ర మంత్రులు మంగళవారం ఢిల్లీకి బయల్దేరి వెళ్తున్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో కూడిన మంత్రుల బృందం, ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలువనున్నారు. కేంద్రం నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంతో పాటు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడానికి టీఆర్ఎస్ సమాయత్తం కానుంది.