అందుకే తన బొమ్మ, పేరు యాదాద్రిలో చెక్కుకునే ప్రయత్నం
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ తానే ఒక నిజాంను, ఒక మహారాజును అని అనుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. అందుకే కొత్త కట్టడాలతో తన పేరు, చరిత్ర నిలవాలని కోరుకుంటున్నారని విమర్శించారు. ఒక చాకలి ఐలమ్మ, ఒక కుమ్రం భీం వంటి తెలంగాణ యోధుల విగ్రహాలను ప్రజలు కోరుకుంటుంటే, కేసీఆర్ మాత్రం తెలంగాణ విమోచన చరిత్రను, పోరాట యోధుల త్యాగాలను విస్మరించి, తన బొమ్మను, పేరును యాదాద్రి గుడిలో చెక్కుకునే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. ఎర్రమంజిల్ లో కొత్త అసెంబ్లీ భవనం కట్టొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కేసీఆర్ కు చెంపపెట్టు వంటిదని అన్నారు. ఒంటెద్దు పోకడలతో, నియంతృత్వంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తీర్పు కనువిప్పు కావాలని అన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ర్ట ప్రభుత్వాన్ని తమ పార్టీ చాలాసార్లు కోరిందని చెప్పారు. ప్రజలకు ఉపయోగం లేని కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ వద్దని, రూ.5 వేల కోట్ల విలువైన భవనాలను కూల్చి, 5 వందల కోట్లతో కొత్త నిర్మాణాలు వద్దని తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు.
అప్పుడు ప్రశ్నించిండు.. ఇప్పుడు లొంగిపోయిండు
ఉద్యమ సమయంలో విమోచన దినాన్ని ఎందుకు జరపరంటూ అప్పటి సీఎం రోశయ్యను ప్రశ్నించిన కేసీఆర్.. ఇప్పుడు మజ్లిస్ కు లొంగిపోయి నిర్వహించడం లేదని లక్ష్మణ్ఆరోపించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో వారే విమోచన దినాన్ని జరుపుకుంటారని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీ సభ్యత్వం తీసుకున్న విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ చేతుల మీదుగా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. గవర్నర్ పదవికి విద్యాసాగర్ రావు వన్నె తీసుకొచ్చారని, తెలంగాణ ప్రజలు గర్వపడేలా చేశారని లక్ష్మణ్ కొనియాడారు. తమిళనాడు రాజకీయ సంక్షోభ సమయంలో విద్యాసాగర్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన తిరిగి బీజేపీలోకి రావడం తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీదే అధికారం
తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, ఇక్కడ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని విద్యాసాగర్ రావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీనే అధికారంలోకి వస్తుందనే భావన కనిపిస్తోందన్నారు. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో, కర్ణాటకలోని 4 జిల్లాల్లో అక్కడి ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయని, రాష్ర్టంలో జరపకపోవడం విచారకరమన్నారు. గవర్నర్ గా తనను నియమించిన తర్వాత ప్రధాని మోడీ ఫోన్ చేసి.. పార్టీకి రాజీనామా చేయమని చెప్పినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరిగాయని, ఇప్పుడు లక్ష్మణ్ నాయకత్వంలో తిరిగి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.

