పీఆర్సీపై ఇవాళ ప్రకటన చేయనున్న సీఎం కేసీఆర్

V6 Velugu Posted on Mar 22, 2021

పీఆర్సీపై సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 29 నుంచి33 శాతం దాకా ఫిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రిటైర్మెంట్ వయసు కూడా 60 ఏళ్లకు పెంచనున్నారు. ఆదివారం ప్రగతి భవన్లో కొత్త ఎమ్మెల్సీలు, ఉద్యోగ సంఘాల నేతలతో నిర్వహించిన లంచ్ మీటింగ్లో కేసీఆర్ స్పష్టతనిచ్చారు. హైదరాబాద్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకోవడంతో ఇదివరకే ఇచ్చిన హామీని అమలు చేసేందుకు సీఎం ఓకే చెప్పారు. 29% లేదా అంతకన్నా ఎక్కువే ఫిట్మెంట్ ఇచ్చే అవకాశముందని సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్తున్నారు.

5.29 లక్షల మందికి లబ్ధి

రాష్ట్రంలో 2.62 లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. జీతాల పెంపుతో పడే భారాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు పెంచింది. 5.29 లక్షల మందికి ఒక్క శాతం ఫిట్మెంట్ అమలు చేస్తే ఏటా అదనంగా రూ.225 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఒక్క శాతం నుంచి మొదలుకొని 30 శాతం వరకు ఫిట్మెంట్ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై అంచనాలను ఇప్పటికే సీఎంకు ఆర్థిక శాఖ నివేదించింది. ఆ లెక్కన రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్మెంట్ ఇస్తే రూ.4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ.4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ.5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ.5,625 కోట్లు, 27 శాతం ఇస్తే రూ.6,075 కోట్లు, 30 శాతం ఇస్తే 6,750 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ లెక్క కట్టింది. 

ఇక ఇప్పటికే ఉద్యోగులకు రెండు కరువు భత్యాలను (డీఏ) చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం శాఖల వారీగా మంజూరైన పోస్టులు, కొత్తగా భర్తీ చేయాల్సిన 50 వేల ఉద్యోగాలపై ఆర్థిక శాఖ లెక్కలు తీస్తోంది. ఈ రెండేళ్లలో 12 వేల మంది ఉద్యోగులు రిటైరయ్యారు. దాని ప్రకారమే 1 శాతం ఫిట్మెంట్కు రూ.225 కోట్లు అవుతుందని అంచనా. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు చేపడుతున్నందున 1 శాతం ఫిట్మెంట్కు రూ.300 కోట్ల పైనే  వెచ్చించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన 29 నుంచి 30 శాతం ఫిట్మెంట్ ఇస్తే ప్రభుత్వం ఏటా రూ.8,700 కోట్ల నుంచి రూ.9 వేల కోట్ల వరకు అదనంగా వెచ్చించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ కేటాయింపులను చూపారు.

పీఆర్సీపై అనవసర ప్రచారం చేయొద్దు: ఈసీ

రాష్ట్రంలో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో పీఆర్సీ ప్రకటనకు అనుమతి ఇవ్వాలని సీఈసీని రాష్ట్ర ఆర్థికశాఖ కోరింది. స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఇబ్బంది లేదంది. అయితే అనవసర ప్రచారం చేయొద్దని, ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో  రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించొద్దని సూచించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్కు సీఈసీ కార్యదర్శి అవినాష్ కుమార్ ఆదివారం లెటర్ రాశారు. 

సీపీఎస్ ఉద్యోగులకు శుభవార్త!

కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త చెప్పనున్నారు. వారికి ఫ్యామిలీ పెన్షన్ వర్తింపజేయనున్నారు. అలాగే 2018 జులై నుంచి పీఆర్సీ ఎరియర్స్ చెల్లిస్తామని ప్రకటించనున్నట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అలవెన్స్లు ఇస్తామని, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ముగియగానే టీచర్ల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పనున్నట్లు సమాచారం. జోనల్ విధానం తేలకుంటే పాత జోన్ల ప్రకారమే ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇస్తామని సీఎం చెప్పినట్టు తెలిసింది.

Tagged CM KCR, Today, PRC

Latest Videos

Subscribe Now

More News