నామినేషన్​ పత్రాలకు కేసీఆర్ పూజలు

నామినేషన్​ పత్రాలకు కేసీఆర్ పూజలు

సిద్దిపేట, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్‌‌ అధినేత, సీఎం కేసీఆర్‌‌‌‌ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు రోడ్డు మార్గంలో కోనాయిపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్‌‌కు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్‌‌ పత్రాలపై ఆలయ ఆవరణలోనే కేసీఆర్​ సంతకం పెట్టి స్వామి పాదాల వద్ద వాటిని ఉంచి, పూజలు నిర్వహించారు. దాదాపు 45 నిమిషాలు ఆలయంలోనే గడిపిన కేసీఆర్‌‌‌‌.. 1.15 గంటలకు తిరిగి హైదరాబాద్‌‌ వెళ్లారు. 

కాగా, గత మూడున్నర దశాబ్దాలుగా రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా.. సీఎం కేసీఆర్‌‌‌‌ కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, మొదలు పెడతారు. ఈసారి కూడా ఆయన అదే సెంటిమెంట్‌‌ను పాటించారు. నామినేషన్‌‌ పత్రాలకు పూజలు నిర్వహించిన అనం తరం ఆలయం నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌‌‌‌కు.. గ్రామ మహిళలు హారతులు ఇచ్చారు. 

తర్వాత గ్రామస్తులతో కాసేపు మాట్లాడి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 9న గజ్వేల్‌‌, కామారెడ్డి అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్‌‌‌‌ నామినేషన్‌‌ దాఖలు చేయనున్నారు. మరోవైపు, కేసీఆర్‌‌‌‌తో పాటు మంత్రి హరీశ్‌‌రావు కూడా తన నామినేషన్‌‌ పత్రాలకు ఆలయంలో పూజలు నిర్వహించారు.