సిద్దిపేట, వెలుగు: లైసెన్స్ డ్ సర్వేయర్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలోని క్యాంప్ ఆఫీస్లో రాష్ట్రంలోని లైసెన్స్డ్ సర్వేయర్ల ప్రతినిధులు హరీశ్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం, మంత్రి మాటలు నమ్మి లైసెన్స్డ్ సర్వేయర్లు తమ ఉద్యోగాలు వదులుకొని వచ్చారని తెలిపారు. భూభారతి పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,500 మందిని లైసెన్స్ డ్ సర్వేయర్లుగా ఎంపిక చేసి, ఇప్పుడు వారిని రోడ్డున పడేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు చదువుకొని, ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని ఆశతో వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎంపికకు ముందు ఎన్నో మాటలు చెప్పి, ఇప్పడు ఎకరం సర్వే చేస్తే రూ.10 ఇస్తున్నారని, ఏడాదంతా కష్టపడితే రూ.2 వేలు మాత్రమే వస్తాయని తెలిపారు. సర్వేయర్లను మండల ఆఫీసుల్లో కూలీల్లా వాడుకుంటూ శ్రమదోపిడీ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం లైసెన్స్డ్ సర్వేయర్లకు గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
