ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన సమ్మక్క– సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. సమ్మక్క సారక్క గద్దెల పునరుద్ధరణ పైలాన్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కుటుంబ సమేతంగా వనదేవతలకు తొలి మొక్కు చెల్లించుకున్నారు .సమ్మక్క-సారలమ్మకు మనవడితో కలిసి రేవంత్ 68 కిలోల బెల్లాన్ని వనదేవతలకు సమర్పించారు. .సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు వనదేవతలకు పూజలు చేశారు. సీఎం తొలి దర్శనం తర్వాత మొదటగా మహిళలకే దర్శనం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఈ జాతర కోసం రూ. 251 కోట్లను మంజూరు చేసింది. ఇందులో రూ. 150 కోట్లతో జాతర నిర్వహణ, ఏర్పాట్లు, రూ.101 కోట్లతో గద్దెల విస్తరణ, శాశ్వత అభివృద్ధి పనులకు ఖర్చు చేసింది.
జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
టీటీడీ బోర్డు మాదిరిగా మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు 2026, జనవరి 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మక్క సారలమ్మ మహా జాతర ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఇర్ప సుకన్య సునీల్ నియమితులయ్యారు. బోర్డు డైరెక్టర్లుగా 15 మందిని నియమించారు.
