నన్ను కోసుకు తిన్నా.. పైసల్ లేవ్.. ఉద్యోగ సంఘాలపై CM రేవంత్ సీరియస్

నన్ను కోసుకు తిన్నా.. పైసల్ లేవ్.. ఉద్యోగ సంఘాలపై CM రేవంత్ సీరియస్

హైదరాబాద్: ఉద్యోగ సంఘాల నేతలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉద్యోగ సంఘాలు ఇక సమరమే అంటున్నాయి.. ఎవరి మీద మీ సమరం..? తెలంగాణ ప్రజలపైనా ఉద్యోగ సంఘాలు సమరం చేస్తాయా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో జీతాలు రాకున్న నోరు విప్పలేదు.. ఇప్పుడు వాళ్ల అడగకముందే జీతాలు ఇస్తోన్న  సమరం చేస్తామంటున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కొన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయని.. రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దని సూచించారు.

కొత్త కోరికలతో ధర్నా చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతోందన్నారు. ఉద్యోగ సంఘాలు బాధ్యత మరిస్తే సమాజం సహించదని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలా కాకుండా ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నందుకా మాపై మీ సమరం అని ప్రశ్నించారు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంటే.. సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నాయని.. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలపై లేదా అని నిలదీశారు. సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందామని ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సమరం కాదు.. సమయ స్ఫూర్తి, సంయమనం కావాలని హితవు పలికారు. ప్రభుత్వం అంటే కేవలం మేమే కాదని.. ప్రభుత్వ ఉద్యోగులంతా మా కుటుంబ సభ్యులేనని అన్నారు. రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిన స్థితిలో ఉందని.. ఒక్కరూపాయి కూడా అప్పు పుట్టడం లేదని.. బ్యాంకులకు వెళితే దొంగలను చూసినట్లు చూస్తున్నారని అన్నారు. అణాపైసా చిక్కడం లేదని.. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పినా ఎవరూ నమ్మడం లేదన్నారు. కనీసం గ్రామాల్లో రోడ్లు వేయాలనే పరిస్థితి నెలకొందని.. స్వీయ నియంత్రణ మాత్రమే దీనికి పరిష్కారమని తెలిపారు. 

►ALSO READ | భారత రక్షణ వెబ్‌సైట్లపై పాక్ సైబర్ అటాక్..సెన్సిటివ్ సమాచారం చోరీకి యత్నం

ఉద్యోగులు డిమాండ్ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.. ఏ పథకాలు ఆపి మీ డిమాండ్లు నేరవేర్చాలో మీరే చెప్పండన్నారు. ఉద్యోగ సంఘాలు నన్ను కోసుకొని తిన్నా కూడా.. వచ్చినా ఆదాయానికి మించి నేను ఏమి చేయలేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే.. మనమంతా ఒక కుటుంబ.. అలాంటి కుటుంబ పరువును బజారున పడేయొద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని దివాళా తీయించిన కేసీఆర్.. మూడు నెలలకు ఒకసారి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వాన్ని తిట్టి పోతాడని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఫెయిల్ అయ్యాయని చెప్తూ కేసీఆర్ పైశాచికానందం పొందుతున్నాడని నిప్పులు చెరిగారు.