
పహల్గాం ఉగ్రదాడి తర్వాత నెలకొన్న ఉద్రిక్తతల మధ్య పాక్ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతోంది. తాజాగా సోమవారం(మే5) ఏకంగా రక్షణ రంగం వెబ్ సైట్లను హ్యాక్ చేసేందుకు పాక్ సైబర్ గ్రూపులు యత్నించాయి. భారత రక్షణ రంగ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దొంగిలించేందుకు పాక్ సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారు. పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ పేరుతో పనిచేస్తున్న ఒక సోషల్ మీడియా ఖాతా ఈ దాడులకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా ప్రకటన చేసింది.
రక్షణ సిబ్బంది లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ లతో సహా సున్నితమైన సమాచారాన్ని చోరీ చేసేందుకు ఈ సైబర్ అటాక్ జరిగిందని ప్రాధమిక అంచనాకు వచ్చారు. పాక్ చేస్తున్న ఈ సైబర్ దురాక్రమణలపై అత్యవసర దర్యాప్తు జరుగుతోంది. ఏమేరకు సైబర్ నేరగాళ్లు చొరబాటు ప్రయత్నం చేశారు, దాని ప్రభావం ఎంత ఉంది అనే విషయాలను తెలుసుకునే సైబర్ సెక్యూటీ టీం దర్యాప్తు చేస్తున్నాయి.
పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ పేరుతో పనిచేస్తున్న ఓ సోషల్ మీడియా ఖాతా ఈ దాడులకు బాధ్యత వహిస్తూ బహిరంగంగా ప్రకటన చేసింది. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ,మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ నుండి రహస్య డేటాను యాక్సెస్ చేసినట్లు ఆ గ్రూప్ తెలిపింది. రెండూ భారతదేశ రక్షణ చట్రానికి కీలకమైనవి.
రక్షణ మంత్రిత్వ శాఖ అనుబంధ ప్రభుత్వ రంగ విభాగమైన ఆర్మర్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (AVNL) అధికారిక వెబ్‌సైట్‌ను ధ్వంసం చేయడానికి అదే బృందం ప్రయత్నించిందని తెలుస్తోంది. నష్టాన్ని అంచనా వేసేందుకు పూర్తిస్థాయి సెక్యూరిటీ ఆడిట్ నిర్వహిస్తున్నారు.