వంద రోజుల్లో మేడారం పనులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్

వంద రోజుల్లో మేడారం పనులు పూర్తి చేయాలి : సీఎం రేవంత్
  • ఆలయ పరిసరాల్లో సహజసిద్ధ రాతి కట్టడాలనే చేపట్టాలి: సీఎం రేవంత్ 
  • వారంలో మేడారం పనులు పరిశీలించేందుకు వస్తానని వెల్లడి 
  • బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధి డిజైన్ల పరిశీలన 

హైదరాబాద్, వెలుగు: వంద రోజుల్లో మేడారం మహాజాతర పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సోమవారం జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. నిర్మాణాల్లో సహజ సిద్ధమైన రాతి కట్టడాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. 

భక్తుల సౌకర్యార్థం ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాల వారీగా చెక్ డ్యామ్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఈ వారంలో తాను మేడారం సందర్శించి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని, అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే, బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధిపై కూడా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. 

అన్ని దేవాలయాల అభివృద్ధిలో స్థానిక సెంటిమెంట్లను, నిపుణులు, పూజారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఇతర
ఉన్నతాధికారులు పాల్గొన్నారు.