ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడి..రాహుల్, ప్రియాంక అరెస్ట్ను ఖండించిన సీఎం రేవంత్

ప్రాథమిక హక్కులపై కేంద్రం ప్రత్యక్ష దాడి..రాహుల్, ప్రియాంక అరెస్ట్ను ఖండించిన సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతల అక్రమ అరెస్ట్​ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం చేస్తున్న ప్రత్యక్ష దాడి ఇది అని ఆయన మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు.

వారిని జైలుకు పంపినా, అణచివేత చర్యలకు పాల్పడినా న్యాయం, జవాబుదారి తనం కోసం పోరాడుతున్న మిలియన్ల మంది భారతీయ యువత ఆక్రోశాన్ని, నిరసన గళాన్ని  కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం అణచివేయలేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న యువతకు, విద్యార్థులకు యావత్ కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలందరూ అండగా ఉంటారని ఎక్స్ లో సీఎం  పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ ఎటువంటి వేధింపులకైనా  బెదిరేది లేదని స్పష్టం చేశారు. అలాగే, రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టులను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి కూడా వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు.