- ఒక్క గ్రూప్ 1 పోస్టు కూడా నింపలే..అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి
- క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నరు
- మేం 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఆ నోటిఫికేషన్లు తామే ఇచ్చామంటరా?
- బీఆర్ఎస్ నేత కేటీఆర్‌వి సిగ్గులేని మాటలన్న సీఎం
- తాము ప్రతి ఉద్యోగ ఖాళీనీ భర్తీ చేస్తామని ప్రకటన
- అసెంబ్లీకి రాకుండా ఫామ్‌హౌస్‌లో పడుకొని సుద్దులు చెప్తున్నరని ఫైర్
- అందెశ్రీ స్మృతివనానికి శంకుస్థాపన
హైదరాబాద్, వెలుగు:పదేండ్లు అధికారంలో ఉన్న గత పాలకులకు ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక్క గ్రూప్1 పోస్టు కూడా
నింపనివాళ్లు నేడు ఫామ్‌హౌస్‌లో పడుకొని సుద్దులు చెప్తున్నారని, అలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడవద్దని నిరుద్యోగులకు సూచించారు. ‘‘మేం అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కానీ ఆ నోటిఫికేషన్లు తామే ఇచ్చామంటూ బీఆర్ఎస్ నేత కేటీఆర్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నాడు. అరకొర నోటిఫికేషన్లు ఇచ్చి క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న చరిత్ర వాళ్లది..’’ అని విమర్శించారు. శనివారం ఘట్కేసర్‌లో దివంగత కవి, రచయిత అందెశ్రీ స్మృతివనానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అంతకుముందు అందెశ్రీ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. గత పదేండ్లలో అధికారంలో ఉన్న కల్వంకుంట్ల కుటుంబం తమ వాళ్ల సొంత ఉద్యోగాలే తప్ప నిరుద్యోగుల గురించి ఏనాడూ ఆలోచించలేదన్నారు.
“ఇయ్యాల మేక తోలు కప్పుకున్న తోడేళ్లు బయటికి వచ్చి మాట్లాడుతున్నాయి. కేసీఆర్ నోటిఫికేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చిండట. నేను అడగదలుచుకున్నా ఈ తోడేళ్ల గుంపును.. నోటిఫికేషన్లు ఇచ్చి ప్రశ్నాపత్రాలను జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠాణీల్లా అమ్ముకొని వందలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నావు తప్ప, ఆ పరీక్షలు పూర్తి చేసి పిల్లలకు నియామక పత్రాలు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా నీకు వచ్చిందా?" అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తాము 60 రోజుల్లోనే 11 వేల టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి అప్పగించామని, 16 ఏళ్ల తర్వాత గ్రూప్-1 నియామకాలను సక్రమంగా పూర్తి చేసి రాష్ట్ర యువతకు న్యాయం చేశామని స్పష్టం చేశారు. ఎల్బీ స్టేడియం, శిల్పకళా వేదిక సాక్షిగా తల్లిదండ్రుల సమక్షంలో ఆ బిడ్డలకు ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. ‘‘పదేళ్లు వాళ్లు నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేకపోయారు? ఏడాదిలో 70 వేల ఉద్యోగాలు మేం ఎలా భర్తీ చేశాం. నిరుద్యోగులు గమనించాలి. ఇలాంటి మాయగాళ్ల ఉచ్చులో పడవద్దు’’ అని సీఎం సూచించారు. అప్పట్లో కవిత ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని, వినోద్ రావును ప్రజలు తిరస్కరిస్తే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా చేసుకున్నారని.. కానీ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాత్రం వీరికి గుర్తుకు రాలేదన్నారు. తమ ప్రభుత్వంలో శంకరమ్మను, చాకలి ఐలమ్మ మనుమరాలిని మహిళా కమిషన్ మెంబర్లుగా నియమించామని చెప్పారు. కోదండరాంను ఎమ్మెల్సీ చేసుకున్నామని, 9 మంది కవులను సన్మానించి రూ. కోటి చొప్పున బహుమతి ఇచ్చి గౌరవించుకున్నామని సీఎం వివరించారు.
అందెశ్రీ నాకు పెద్దన్న, ఆత్మబంధువు..
తెలంగాణలో గత పాలకుల అహంకార వైఖరిపై అందెశ్రీ గళమెత్తారని, అందుకే కుట్రతో గత పదేళ్లలో ఆయన పాటను వినిపించకుండా చేశారని సీఎం రేవంత్ అన్నారు. అందెశ్రీని తాను పెద్దన్నగా భావించానన్నారు. ఏ రోజైతే అందెశ్రీ గళాన్ని బంధించాలనుకున్నారో.. గద్దరన్నను అవమానించారో ఆనాడే గడీల పాలనను శాశ్వతంగా పాతరేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. అందెశ్రీ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందెశ్రీ మళ్లీ పాటగా వచ్చి తెలంగాణకు స్ఫూర్తిగా ఉంటాడని, ఆయన స్పూర్తే తమ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అని స్పష్టం చేశారు. “అందెశ్రీ మీకందరికీ కవి, రచయిత అయితే.. నాకు మాత్రం ఒక ఆత్మ బంధువు. పెద్దన్న. నిరాశ, నిస్పృహలకు లోనైనప్పుడు అందెశ్రీ నాకు స్ఫూర్తిగా నిలబడేవారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలుస్తుందని ఆనాడు భావించాం. పెన్నులపై మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ ప్రతీ బడిలో, ప్రతీ గడపలో ఆయన పాట వినిపిస్తోంది. అందెశ్రీని పిలిపించుకుందామని దూతలను పంపిస్తే ఆయన ఆత్మగౌరవంతో దొర గడప తొక్కలేదు. తన పాట కోట్లాది తెలంగాణ ప్రజల కోసం తప్ప.. గడీలలోని దొరల కోసం కాదని అందెశ్రీ నిటారుగా నిలబడ్డారు. పాటతో పెట్టుకున్నోడు. .గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్నోడు కాలగర్భంలో కలిసిపోతడని ఆనాడే చెప్పినం. మనందరం దండు కట్టి విష సర్పాలను తుదముట్టించాలని ఆయన అన్న మాటలు నాకు ఇంకా గుర్తొస్తున్నాయి” అని సీఎం తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలి?
ప్రజా ప్రభుత్వం ఎందుకు పోవాలని శాపనార్థాలు పెడుతున్నారని, కానీ ఎందుకు పోవాలని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘‘మేం పోవాలి అంటున్నాడు. ఎందుకోసం పోవాలి? నువ్వు దోసుకోవడానికి మేం దిగిపోవాలా? నీ దొంగతనాల కోసం, నీ కుటుంబ దురాశ కోసం మేము దిగిపోవాలా? ఆడపిల్లలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మేము దిగిపోవాలా? ప్రతి ఇంట్లో రేషన్ కార్డు ఇచ్చి, 3 కోట్ల 28 లక్షల మందికి సన్న బియ్యం 6 కిలోల లెక్కన ఇస్తున్నందుకు మేము దిగిపోవాలా? 200 యూనిట్ల కరెంట్ 50 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఇచ్చినందుకు, ప్రతి పేదవాడికి కేవలం రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నందుకు మేము దిగిపోవాలా? పేద ప్రజలకు 7 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు, 70 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినందుకు, రైతుల కోసం రూ. 21 వేల కోట్ల రుణమాఫీ చేసినందుకు మేము దిగిపోవాలా?’’ అని ప్రశ్నించారు.
ప్రతి ఖాళీని భర్తీ చేస్తం..
ప్రతి ఉద్యోగ ఖాళీని భర్తీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ‘‘ప్రతి ఖాళీని భర్తీ చేసే బాధ్యత మీ రేవంత్ అన్నది. తులసీవనంలాంటి ఈ తెలంగాణ సమాజంలో గంజాయి మొక్కను మొలకెత్తనిచ్చే సమస్యనే లేదు. మాయగాళ్ల మాటలు నమ్మకండి, ప్రతి ఉద్యోగాన్ని పూర్తి చేసి మీకు న్యాయం చేస్తాం. రికార్డులు రాసుకోండి.. 94 నుంచి 2004 వరకు రెండుసార్లు టీడీపీ అధికారంలో ఉన్నది.2004 నుంచి 2014 వరకు రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు మీరు రెండుసార్లు అధికారంలో ఉన్నారు. ఈ 2024 నుంచి 2034 వరకు పదేళ్ల పాటు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఇదే చరిత్ర. ఇక మీకు గతమే తప్ప భవిష్యత్ లేదు’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నరు..
గత పాలకుల దోపిడీని ప్రజలు ఇంకా మరిచిపోలేదని సీఎం రేవంత్ అన్నారు. ‘‘మా స్ఫూర్తి అందెశ్రీ, గద్దరన్న, సోనియా గాంధీ. మరి నీ స్ఫూర్తి ఎవరు? నిజామా? కాసిం రిజ్వీనా ? నీ నీతేంది? నీకు మాకు పోలికేంది?’’ అని మండిపడ్డారు. ‘‘ఒకప్పుడు ప్రపంచ ధనికుల్లోనే రెండో స్థానంలో ఉన్న నిజాం ప్రభువుల కుటుంబం.. రెండు తరాల తర్వాత చూస్తే దిక్కులేని స్థితికి దిగజారి కకావికలం అయిపోయింది. నీకుటుంబం ఎంత? ఇయాల చాలా ఉన్నాయని నువ్వు(కేసీఆర్) అనుకుంటున్నవేమో.. ఏదీ ఉండదు. బిచ్చం ఎత్తుకొని బతాకాల్సి వస్తుంది. చర్చకు రమ్మంటే చేతకాదు. అసెంబ్లీకి రమ్మంటే ఇంట్ల పండుకుంటవ్.. అక్కడి నుంచి కుట్రలు కుతంత్రాలు చేస్తవ్.. నిజాం కంటే గొప్ప అని అనుకుంటున్నవ్. కానీ తెలంగాణ సమాజం మళ్లీ మిమ్మల్ని క్షమించదు” అని సీఎం తేల్చిచెప్పారు. ‘‘నీ తండ్రి ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్‌హౌస్, నువ్వు జన్వాడలో 100 ఎకరాల ఫామ్‌హౌస్, నీ బావ హరీశ్ రావు మోయినాబాద్‌లో 50 ఎకరాలు, నీ చెల్లెలు కవిత శంకర్ పల్లిలో 25 ఎకరాల ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటే, తెలంగాణ మాత్రం రూ. 8.11 లక్షల కోట్ల అప్పుల్లో మునిగిపోయింది”అని కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు.
