- మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్: సీఎం రేవంత్
- ఆ బిల్లుకు మేం ఏనాడూ వ్యతిరేకం కాదు
- ఎన్నికల్లో లబ్ధి కోసమే మహిళా రిజర్వేషన్ల పేరుతో మోదీ సర్కారు రాజకీయం
- స్థానిక సంస్థల్లో విమెన్ కోటా ఫస్ట్ అమలు చేసిందే రాజీవ్ గాంధీ
- గతంలోనే సోనియా గాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టారు
- 50 శాతం పెంపు ఫార్ములాతో డీలిమిటేషన్‌కు వెళ్తే ప్రజా ఉద్యమం తప్పదు
- దక్షిణాది ప్రమేయం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే కుట్ర
- అసలే గాయపడి ఉన్నాం.. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు
- వ్యవసాయ చట్టాల మాదిరిగానే డీలిమిటేషన్‌ను వెనక్కి తీసుకోక తప్పదు
- ప్రస్తుత ప్రాతినిధ్యం ఉన్నందునే కిషన్ రెడ్డి, బండికి
- కనీసం చెప్రాసీ పదవులైనా దక్కినయ్.. లేదంటే అవీ ఉండవు
- బీఆర్ఎస్లో చేరిన ఆలే నరేంద్ర నుంచి పొన్నాల వరకు
- ఏమయ్యారో జీవన్‌రెడ్డికి తెలియదా? అని కామెంట్
న్యూఢిల్లీ, వెలుగు:మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ అందులో ఓబీసీ కోటా అమలు చేయాలనేదే తమ డిమాండ్ అని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘‘మహిళా రిజర్వేషన్లు మా పార్టీ మానస పుత్రిక(బ్రెయిన్ చైల్డ్) .. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లను తొలుత అమలు చేసింది మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ.. గతంలోనే సోనియాగాంధీ మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టారు” అని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న తమిళనాడు, వెస్ట్ బెంగాల్‌లో రాజకీయంగా లబ్ధిపొందేందుకే మోదీ సర్కారు ఉన్నట్టుండి మహిళా రిజర్వేషన్ పేరుతో రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు.
శుక్రవారం సీడబ్ల్యూసీ మీటింగ్‌లో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేశారు. ‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ల కోసం సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడున్న 543 లోక్‌సభ స్థానాల్లోనే 181 సీట్లను మహిళలకు కేటాయించి రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా?’’ అని ప్రశ్నించారు.
వచ్చే ఏడాది మార్చి కల్లా జన గనణ పూర్తి చేయవచ్చని, తర్వాత 12 నెలల్లో డీలిమిటేషన్‌తోపాటు మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం 5 నెలల్లోనే కులగణనను పూర్తి చేశామని, చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం 33శాతం మహిళా రిజర్వేషన్లలో ఓబీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సీడబ్ల్యూసీలో ఇదే అంశం సూచించారని తెలిపారు. ఖర్గే, రాహుల్, ప్రియాంకలతోపాటు నేతలందరూ ఈ ప్రతిపాదనకే ఆమోదం తెలిపారని చెప్పారు.
గాయపడి ఉన్నాం.. రెచ్చగొట్టొద్దు..
కేంద్రంలోని మోదీ సర్కార్.. లోక్ సభ సీట్ల పెంపు(డీలిమిటేషన్)పై 50 శాతం ఫార్ములతో ముందుకు వెళ్తే.. దక్షిణాదితో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న చిన్నరాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి నొక్కి చెప్పారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రాల మధ్య అంతరాలు పెరిగి, పరిస్థితులు ఎక్కడివరకైనా దారి తీయవచ్చని హెచ్చరించారు. ‘‘మేం (దక్షిణాది ప్రజలు) ఇప్పటికే గాయపడి ఉన్నాం.. మమ్మల్ని మరింత రెచ్చగొట్టొద్దు’’ అని హితవుపలికారు. ఇది పార్టీల మధ్య సమస్య కాదని, ప్రజా వ్యతిరేక ఉద్యమానికి దారి తీస్తుందన్నారు.
రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే .. నియోజకవర్గాల పునర్విభజనను కూడా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీ మీటింగ్‌లో తెలంగాణ సీఎంగా 50 శాతం సీట్ల పెంపుతో రాష్ట్రంతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు జరగబోయే నష్టంపై తాను మాట్లాడినట్లు తెలిపారు. ‘‘50% పెంపు ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. యూపీలో ప్రస్తుతం 80 సీట్లు, తమిళనాడులో 40 సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం వాటి మధ్య అంతరం 40 సీట్లు. 50 శాతం ప్రాతిపదికన సీట్లు పెంచితే యూపీ సీట్లు 120కి చేరి, తమిళనాడులో 60 పెరుగుతాయి. వీటి నడుమ అంతరం 60 సీట్లకు పెరుగుతుంది.
ఇది కేవలం యూపీ, తమిళనాడు మధ్య సమస్య కాదు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో ఇదే పరిస్థితి ఉంటుంది. మొత్తం సౌత్స్టేట్స్లలో 130 నుంచి 195 సీట్లు పెరిగితే.. ఉత్తరాదిలో 600 సీట్లు అవుతాయి’’ అని సీఎం వివరించారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాదికి ఎలాంటి ప్రయార్టీ లేకుండా పోతుందన్నారు. సీట్లు ఎన్ని పెంచినా.. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య ఉన్న గ్యాప్ తగ్గాలే గానీ పెరిగితే ఒప్పుకునే పరిస్థితే లేదన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, కేంద్రం లీకేజులు ఇస్తున్న ఇతర సవరణలపై ఇండియా కూటమితో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీడబ్ల్యూసీ మీటింగ్ లో నిర్ణయించామని తెలిపారు.
ఆర్థిక ప్రాతిపదికన పెంచండి..
ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, మెరిట్ తరహాలో నియోజకవర్గాల పెంపు విధానం ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తున్న సౌత్ , వెస్ట్ రాష్ట్రాలకు 50శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు రెండో శ్రేణి పౌరులుగా మిగిలిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అత్యధిక జీడీపీని అందిస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక ప్రాతిపదికన సీట్లు పెంచాలన్నారు.
పన్నుల రూపంలో కేంద్రానికి తెలంగాణ రూ. 100 ఇస్తే.. కేవలం 34 శాతం మాత్రమే తిరిగి వస్తున్నదని చెప్పారు. అంటే తెలంగాణకు 45 పైసలు, కర్నాటకకు 46 పైసలు, కేరళకు 16 పైసలు, అదే యూపీకి రూ. 3.5, మధ్య ప్రదేశ్ కు రూ. 2.5 , గుజరాత్, ఇతర ఉత్తరాది రాష్ట్రాలకు సైతం భారీగా నిధులు దక్కుతున్నాయని చెప్పారు.
ఆర్థికంగానే కాకుండా.. రాజకీయంగా దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని సీఎం అన్నారు. కానీ కాంగ్రెస్ పాలనలో ఏనాడు ఇలాంటి వివక్ష చూపలేదని, ప్రధాని ఉత్తరాది నుంచి ఉంటే, దక్షిణాది నుంచి రాష్ట్రపతి ఇచ్చామని చెప్పారు. అలాగే, కీలకమైన 10 కేబినెట్ పదవుల్లో దక్షిణాదికి పెద్దపీట వేశామని చెప్పారు. ప్రస్తుతం మోదీ పాలనలో పదవులు, ఫండ్స్ఉత్తరాదికే తరలించుకుపోయారని విమర్శించారు.
బండి, కిషన్ రెడ్డికి ఆ పదవులు కూడా ఉండవ్..
ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం ఆధారంగానే తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కి కేంద్రంలో కనీసం చెప్రాసి పదవులు అయినా దక్కాయని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ప్రాతినిధ్యం కూడా లేకపోతే వారికి ఎలాంటి పదవులు ఉండవని అన్నారు. మరోవైపు లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. దక్షిణాదికి జరిగే అన్యాయంపై మాట్లాడడం లేదన్నారు. ‘‘సంస్కృతి, చరిత్రపరంగా దక్షిణాది ఎప్పటికీ వేరు. దక్షిణ–ఉత్తరాదిలది.. ద్రవిడ, ఆర్యన్ కల్చర్. బీజేపీ ఎప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకు పరాయి పార్టీనే.
అందుకే దక్షిణాదిలో ఎదగలేక.. ఈ రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం లేకుండా అధికారంలోకి వచ్చేందుకు 50 శాతం సీట్ల పెంపుతో కుట్ర చేస్తున్నది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల ముసుగుతో కేంద్రం దక్షిణాది, చిన్న రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, గోవా, ఢిల్లీ, ప్రజల ను మోసం చేయాలని చూస్తున్నదన్నారు. అందుకే ఈ నెల 16, 17, 18 తేదీల్లో జరిగే సమావేశా ల అజెండా ఇప్పటికీ బహిర్గతం చేయలేదన్నారు. సంఖ్యా బలం ఉందని మోదీ సర్కార్ డీలిమిటేషన్ పై రాజ్యంగ సవరణ చేస్తామనుకుంటే పైన దేవుడు ఒకడు ఉంటాడని, ఆయనను శిక్షించక మానడని హెచ్చరించారు.
ఆలే, పొన్నాల ఏమయ్యారు?
పార్టీ మారిన సీనియర్ నేత జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పై విమర్శలు చేసిన కేటీఆర్‌కు సీఎం రేవంత్ కౌంటర్ ఇచ్చారు. ‘‘బీఆర్ఎస్ పార్టీ సీనియర్లకు ఎప్పుడు గౌరవం ఇవ్వలేదు. ఆలే నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్, విజయశాంతి, చివరకు పొన్నాల లక్ష్మయ్యలాంటి వారిని పార్టీ నుంచి బయటికి గెంటేశారు.. అసలు పొన్నాల పరిస్థితి ఏంటి?.. ఎక్కడైనా ఆయనను చూశారా? గతంలో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే వారి నియోజకవర్గాల్లో గెలిచిన వారిని వెంటనే పార్టీలో చేర్చుకున్నారు. తుమ్మల, జూపల్లిలాంటి మాజీ మంత్రులకు కనీసం వార్డు మెంబరు సీటు ఎంపిక చేసే అవకాశం బీఆర్ఎస్ ఇవ్వలేదు’’ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.
