- మీ మధ్య వైరుధ్యాలుంటే మీరు మీరు తేల్చుకోండి
- తలుపులు మూసుకొని కొట్టుకోండి: సీఎం రేవంత్
- ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్లు ఇరిగినట్టున్నది
- ప్రభుత్వంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చినా నా గౌరవానికే భంగం
- మీ రాతలతో ఫాంహౌస్‌లో ఉన్న శుక్రాచార్యుడికి సహకారం అందించొద్దు
- ఒక్కసారి ఆలోచన చేసి, వాస్తవాలను తెలుసుకొని రాయాలని హితవు
- ఎన్టీవీ, మరో మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం స్పందన
ఖమ్మం, వెలుగు: మీడియా సంస్థల మధ్య పంచాయితీల్లో తమ మంత్రుల్ని బద్నాం చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘మీ మధ్య వైరుధ్యాలు ఉంటే తలుపులు మూసుకొని కొట్టుకోండి.. మీరు మీరూ తేల్చుకోండి’ అని సూచించారు. ఇటీవల మంత్రులపై పలు ఆరోపణలు చేస్తూ రెండు మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి, ఓ లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌కు సంబంధం అంటగడుతూ ఎన్టీవీలో కొద్ది రోజుల కింద ఓ కథనం ప్రసారమైన సంగతి తెలిసిందే. దీనిపై ఐఏఎస్ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) వేయగా.. దర్యాప్తు కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా.. ఎన్డీవీలో వచ్చిన కథనం.. నైనీ బొగ్గు టెండర్ల కోసం జరిగిన పెద్ద కుట్ర అంటూ మరో మీడియా చానల్, పత్రికలో కథనం రాశారు. ఇందులో ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎన్టీవీ మీడియా చానల్ యాజమాన్యానికి పాత్ర ఉందని ఆరోపించారు. ఎన్టీవీ చానల్ యజమాని నరేంద్రనాథ్ చౌదరి అల్లుడికి బొగ్గు టెండర్ కట్టబెట్టేందుకు అడ్డుగా ఉన్న మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని దారిలోకి తెచ్చుకునేందుకే ఆ కల్పిత కథనాలు ప్రసారం చేశారంటూ రాసుకొచ్చారు.
మంత్రి, డిప్యూటీ సీఎం మధ్య లేడీ ఆఫీసర్ బలయ్యారని చెప్పే ప్రయత్నం చేశారు. కాగా.. ఈ రెండు మీడియా సంస్థలు తమ మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలను తీర్చుకునేందుకు మంత్రుల మధ్య విభేదాలను సృష్టించే ప్రయత్నం చేశారని తాజాగా సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పనులు ప్రారంభించిన తర్వాత మద్దులపల్లిలో జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మీడియా వాళ్లు మీకు మీకు ఏమైనా ఉంటే ఒకరిమీద ఒకరు బురదజల్లుకోండి. అందులో మమ్మల్ని లాగొద్దు. ఆంబోతులు కొట్లాడుకుంటే లేగదూడల కాళ్లు ఇరిగిన్నట్టున్నది. ఇద్దరు మీడియా యజమానులు కొట్లాడుకోవాలనుకుంటే మీరు మీరు కొట్లాడుకోండిగానీ, మా మంత్రులను బద్నాం జేసే కార్యక్రమాన్ని మీరు తీసుకోకండి. దయచేసి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాస్తున్న రాతలు, చూపిస్తున్న చూపులు.. మారీచునికి, సుబాహునికి, శుక్రాచార్యుడికి సహకారం అందించినట్లుగా ఉంటది’’ అని పరోక్షంగా బీఆర్‌ఎస్ నేతల ప్రస్తావన తెస్తూ వ్యాఖ్యానించారు.
ఏది అడిగినా వివరణ ఇచ్చేందుకు నేను రెడీ
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోజుకు 24 గంటలు, ఏడాదికి 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పటికీ, మీడియాకు వివరణ ఇవ్వడానికి తాను ఎప్పటికీ సిద్ధంగానే ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘‘ఏదైనా వార్త.. ఏ పేపర్ లో వచ్చినా, టీవీలో వచ్చినా, సోషల్ మీడియాలో వచ్చినా., ఏ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిపై ఆరోపణ వచ్చినా, వాళ్లందరికీ నాయకుడిగా.. కుటుంబ పెద్దగా అది నా గౌరవానికి భంగం కలిగిస్తుంది. నా నాయకత్వం పట్ల అపోహలకు తావిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు.
మా మంత్రుల మీద ఏదొచ్చినా రాసే ముందు నన్ను వివరణ అడగండి. ఒక్కసారి ఆలోచన చేసి, వాస్తవాలను తెలుసుకొని రాయండి’’ అని సూచించారు. ప్రజా పాలనను అందిస్తున్న తమ ప్రభుత్వాన్ని కుట్రలు, కుతంత్రాలతో పడగొట్టాలని ఫాంహౌజ్‌లోని శుక్రాచార్యుడు ప్రయత్నిస్తున్నాడని మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా ద్వారా అడ్డగోలు ప్రచారం చేయిస్తూ.. మంత్రుల మీద వార్తలు రాయిస్తున్నారని అన్నారు. ‘‘బొగ్గు గనులకు సంబంధించి తమ ప్రభుత్వంలో అక్రమాలు, అవకతవకలు జరిగే అవకాశమే లేదు. సీనియర్ల సలహాలతో, సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతున్నం. కోల్‌మైన్ టెండర్లను ప్రభుత్వం నిజమైన, నిఖార్సయిన, అనుభవం ఉన్నవాళ్లకే ఇస్తుందే తప్ప, అణాపైసా అవినీతికి అవకాశం ఇవ్వబోం” అని తేల్చి చెప్పారు.
