మున్సిపల్ ఎన్నికలపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం అయ్యారు. ఫిబ్రవరి 9న 6గంటల 30 నిమిషాల నుంచే మంత్రులతో జూమ్ మీటింగ్ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికలపై క్షేత్రస్థాయి పరిస్థితిని మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం. ఎన్నికల ప్రచారానికి ఇవాళే చివరి రోజు కావడంతో పోల్ మేనేజ్ మెంట్ పై కీలక సూచనలు చేస్తున్నారు.ప్రతికూల పరిస్థితి ఉన్నచోట అలర్ట్ గా ఉండాలనిచెబుతున్నారు.
ఇవాళే చివరి రోజు
మున్సిపల్స్ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటలకు ముగియనున్నది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నారు. కార్నర్ మీటింగ్‌లు, బైక్ ర్యాలీలు, డోర్ టు డోర్ వంటి ప్రచారం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రాం మెదక్ జిల్లాలో ఉండగా సమయం సరిపోదనే కారణంతో పర్యటన రద్దైనట్లు లోకల్ లీడర్లు ప్రకటించారు. ఎలక్షన్ కోడ్ ప్రకారం పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు.
దీంతో ఫిబ్రవరి 9 సాయంత్రం 5 తర్వాత నుంచి 11న పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ టైమ్‌లో బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లీడర్లు పట్టణాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఒకవైపు ఆఫీసర్లు పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పట్టణాల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఓట్ల కోసం నోట్లు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఆఫీసర్లకు చిక్కకుండా అభ్యర్థులు తమ బంధువుల ద్వారా యూపీఐ చేస్తున్నారు. ‘‘సైలెన్స్ పీరియడ్‌లో ప్రచార కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రజలు గుంపులుగా చేరరాదు’’ అన్ని విభాగాల నోడల్ అధికారులను ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు.
