మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ATC, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు: సీఎం రేవంత్

మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే ATC, స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలు: సీఎం రేవంత్

హైదరాబాద్: మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకే అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ), స్కిల్, స్పోర్ట్స్ యూనివర్శిటీలకు శ్రీకారం చుట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం (సెప్టెంబర్ 27) హైదరాబాద్ మల్లేపల్లి ఐటీఐ వేదికగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ (ఏటీసీ)ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టాటా గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 65 ఏటీసీలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‎గా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువు, సాంకేతిక నైపుణ్యం మాత్రమే మన తలరాతను మారుస్తాయని.. టెక్నికల్ స్కిల్స్ లేకపోతే ఈ రోజుల్లో దేనికి కొరగాని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర యువతకు సాంకేతిక నైపుణ్యాలు నేర్చించి ఉద్యోగావకాశాలు కల్పించాలనే లక్ష్యంలో భాగంగా ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేశామని తెలిపారు. ఈ మేరకు దావోస్‎లో టాటా గ్రూప్‎తో చర్చలు జరిపామని చెప్పారు. మొత్తం రూ.2400 కోట్లతో 65 ఏటీసీలను ఏర్పాటు చేశామని.. ఇందులో రూ.2100 కోట్లు టాటా సంస్థ పెడితే ప్రభుత్వం రూ.300 కోట్లు పెట్టిందని తెలిపారు. 

కార్పొరేట్ కంపెనీల్లో కూడా లేని ఎక్విప్మెంట్ ఏటీసీల్లో ఉందన్నారు. ఒక్కొ ఏటీసీలో 170 నుంచి 200 మంది జాయిన్ అవుతారని తెలిపారు. ఏటీసీల్లో ట్రైనింగ్ తీసుకున్నవారిలో 90 శాతం మందికి మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరో 51 ఏటీసీలను మంజూరు చేశామని.. ఏడాదిలో అవి పూర్తి అవుతాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే యువతకు చదువుతో పాటు స్కిల్స్ ఉండాలని సూచించారు. నిరుద్యోగుల పోరాటం వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని కానీ సొంత రాష్ట్రంలో పదేళ్లు గడిచినా యువత ఆకాంక్షలు నేరవేరలేదన్నారు.