హాలీవుడ్తో టాలీవుడ్ పోటీపడాలి..సినిమా రంగం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: రేవంత్ రెడ్డి

హాలీవుడ్తో టాలీవుడ్ పోటీపడాలి..సినిమా రంగం కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి: రేవంత్ రెడ్డి
  • కోకాపేటలో  దేశంలోనే అతిపెద్ద డాల్బీ థియేటర్ ‘అల్లు సినిమాస్’ను ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్, వెలుగు:  సినిమా రంగం కూడా ఒక గొప్ప పరిశ్రమగా ఎదగాలని, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంతో పాటు అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ కుటుంబం కోకాపేటలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద డాల్బీ థియేటర్ ‘అల్లు సినిమాస్’ను సీఎం రేవంత్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలం గాణలో ఐటీ, ఫార్మా రంగాల తరహాలో సినిమా ఇండస్ట్రీ ఎదగాలని ఆకాంక్షించారు. సినిమాలు మధ్య తరగతి వారిపై అత్యంత ప్రభావం చూపిస్తున్నాయని, జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, సామాజిక కోణంలో సినిమాలు అత్యంత ప్రభావం చూపిస్తాయన్నారు. హాలీవుడ్ సినిమాలను చూడటం కాకుండా మనం అలాంటి సినిమాలను తీయగలిగే స్థాయికి ఎదగాలని కోరారు.

ఇక్కడి సినిమా రంగం ఒక నాలెడ్జ్ హబ్‌‌గా ఎదగాలని, అలా చేసినప్పుడే  గొప్పగొప్ప సినిమాలు తీయగలమని అన్నారు. తెలు గు సినిమా రంగం పాన్ ఇండియాతో కాకుండా హాలీవుడ్‌‌తో పోటీ పడాలన్నారు. అల్లు అరవింద్ కుటుంబం ఎంతో ఇష్టంతో నిర్మించిన ఈ డాల్బీ థియేటర్ తెలంగాణకు మంచి పేరు తెస్తుందని సీఎం ఆకాంక్షించారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కుందూరు జయవీర్, గీతా ఆర్ట్స్ అధినేత, సినీ నిర్మాత అల్లు అరవింద్, తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్‌‌ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, నటుడు అల్లు అర్జున్​తో పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.