
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కే. కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన ఇవాళ ( గురువారం, జూలై 4, 2024 ) ఎంపీ పదవికి రాజీనామా చేశారు.ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కేకే ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. తిరిగి సొంతగూటికి చేరిన కేకేతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేకే కు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా క్యాబినేట్ రాంక్ ఇస్తామని తెలిపారు.
తెలంగాణాలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు పక్కా ఉంటుందని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని, రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని అన్నారు.మూసి అభివృద్ధి పై దృష్టి పెట్టామని.. ఈ ప్రాజెక్టు తన పేరు పై రికార్డుగా ఉంటుందని అన్నారు రేవంత్ రెడ్డి. మూసి అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకు ఆస్కారం ఇవ్వనని.. రూల్స్ ప్రకారమే ముందుకు పోతానని అన్నారు సీఎం.